బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నానని, ఈ ప్రయాణం తనలో ఎంతో పరిణతిని తీసుకువచ్చిందని ఆయన తెలిపాడు. ముఖ్యంగా తన భావోద్వేగాలను, కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు.

కోపం వచ్చినప్పుడు దానిని ఇతరులపై ప్రదర్శించకుండా నియంత్రించుకోగలుగుతున్నానని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నాడు. "బయటకు నేను సన్యాసిలా కనిపించవచ్చు, కానీ అంతర్గతంగా కూడా ఆ స్థితికి చేరుకోవాలి. కోపం వచ్చినా కొన్ని క్షణాల్లోనే దానిని తగ్గించుకోగలుగుతున్నాను. అయితే, ఆ కోపం నా మనసును ప్రభావితం చేయకుండా పూర్తిగా నియంత్రించే విద్యను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది" అని ఆయన వివరించాడు.

ఒక ఉత్తమ నటుడిగా ఎదగడానికి జీవితాంతం సాధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డాడు. దురాశ, హింస వంటి సహజ సిద్ధమైన మానవ వికారాలను అధిగమించేందుకు తాను నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఒక సినిమాలోని పాత్ర కోసం కొన్ని వారాల పాటు శ్రమిస్తే సరిపోతుందని, కానీ ఒక నటుడిగా పరిపూర్ణత సాధించాలంటే ఏళ్ల తరబడి అనుభవం, నిరంతర అభ్యాసం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.

ఆయన నటించిన తాజా చిత్రం ‘పారివారిక్ మనోరంజన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వెబ్ సినిమాలో అదితి రావు హైదరీ కూడా నటించాడు. నవంబర్ 13 నుంచి ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.