తిరుపతి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 35 మండలాల పరిధిలో ఉన్న 777 సర్పంచ్ స్థానాలు, 7,210 వార్డు సభ్యుల స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వివిధ కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల 30 పంచాయతీల్లో ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన 777 పంచాయతీలకు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 195 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. మొదటి విడతలో భాగంగా 18 మండలాల్లోని 415 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి నవంబర్ 15న ఎన్నికల నోటీసు జారీ కానుండగా, నవంబర్ 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వీటికి నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రెండో విడతలో మిగిలిన 17 మండలాల్లోని 362 పంచాయతీలకు నవంబర్ 29న పోలింగ్ జరగనుంది.

ఆయా పోలింగ్ తేదీల్లోనే సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యంత్రాంగం పేర్కొంది.