బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది ఆహారం తగ్గిస్తుంటారు. భోజనం మానేయడం, తినే పరిమాణాన్ని మరింత తగ్గించడం, కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టడం వంటివి చేస్తుంటారు. మొదట్లో బరువు తగ్గినట్లు కనిపించినా.. అతిగా ఆహారం తగ్గించడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలగడంతో పాటు, దీర్ఘకాలంలో బరువు నియంత్రణ కష్టమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

శరీరానికి అవసరమైన దానికంటే చాలా తక్కువ కేలరీలు అందితే కొవ్వుతో పాటు కండరాలూ తగ్గే ప్రమాదం ఉంది. తీవ్రమైన ఆహార నియంత్రణ వల్ల శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆకలి పెరగడం వల్ల ఆహార నియంత్రణను కొనసాగించడం కూడా కష్టమవుతుంది. దీంతో కొంతకాలం బరువు తగ్గిన తర్వాత మళ్లీ అదే స్థాయిలో నిలిచిపోవడం లేదా తగ్గిన బరువును నిలబెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

క్రాష్‌ డైట్లు పాటిస్తే శరీరంలోని నీరు, కండరాలు కూడా తగ్గవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కేవలం వెయింగ్‌ మెషీన్‌పై కనిపించే సంఖ్యను చూసి బరువు తగ్గిన ఫలితాన్ని అంచనా వేయకూడదు. కొవ్వు తగ్గడంతో పాటు కండరాలను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. తగినన్ని కేలరీలు, ప్రొటీన్లు అందకపోతే శరీరం శక్తి కోసం కండరాలను విచ్ఛిన్నం చేసుకోవచ్చు. కండరాల పరిమాణం తగ్గితే విశ్రాంతి సమయంలోనూ శరీరం ఖర్చు చేసే శక్తి తగ్గుతుంది. దీనివల్ల మరింత బరువు తగ్గడం కష్టమవుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు ప్రొటీన్లను పూర్తిగా తగ్గించకూడదు. పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు వంటి ప్రొటీన్‌ పదార్థాలతో పాటు కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి సరిపడా ప్రొటీన్లు అందితే కండరాలను కాపాడుకోవడానికి, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలగడానికి తోడ్పడతాయి.

ఆహార నియంత్రణతో పాటు కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయడం కూడా అవసరం. వెయిట్‌ ట్రైనింగ్‌ వంటి బలవర్ధక వ్యాయామాలు, నడక వంటి ఏరోబిక్‌ కార్యకలాపాలు ఉపయోగపడతాయి. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితులు, మందుల వాడకం, జీవనశైలికి అనుగుణంగా వ్యాయామ ప్రణాళికను ఎంచుకోవాలి. అతి తక్కువ కేలరీలతో కూడిన డైట్లకు బదులుగా, శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూ మితమైన కేలరీలు ఉండే ఆహార విధానాన్ని అనుసరించడం దీర్ఘకాలిక బరువు నియంత్రణకు మెరుగైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.