దీపావళి వచ్చిందంటే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, వాటి చుట్టూ దీపాలు కనిపిస్తాయి. కానీ దుబాయ్‌లో మాత్రం ఈ సంప్రదాయానికి కొత్త మెరుపులు అద్దారు. రంగులు, పూలతో కాకుండా ఏకంగా బంగారు ఆభరణాలు, వజ్రాలతో భారీ రంగోలీని రూపొందించారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక అలంకరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దుబాయ్‌లోని సిటీ సెంటర్ డీరా మాల్‌లో ఈ ప్రత్యేక రంగోలీని ఏర్పాటు చేశారు. మొత్తం 6.5 కిలోల బరువున్న 213 బంగారు ఆభరణాలను ఇందుకోసం ఉపయోగించారు. వీటిలో అందమైన హారాలు, భారీ గాజులు, చెవిపోగులు, పెండెంట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 380 క్యారెట్లకు పైగా వజ్రాలను అలంకరణలో పొందుపరిచారు.

ఈ అద్భుతమైన కళాకృతిని ప్రముఖ ఆభరణాల సంస్థ డమాస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంయుక్తంగా రూపొందించాయి. ప్రతి ఆభరణాన్ని జాగ్రత్తగా అమర్చేందుకు కళాకారులు ఎంతో శ్రమించారు. మొత్తం పది మంది నిపుణులు ఏకధాటిగా 16 గంటల పాటు పనిచేసి ఈ రంగోలీని సిద్ధం చేశారు.

ఈ అరుదైన రంగోలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. బహిరంగ ప్రదేశంలో ఇంత విలువైన ఆభరణాలతో కళాకృతిని ఏర్పాటు చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్‌లోనే ఇలాంటి భారీ ప్రదర్శనలు సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రంగోలీ రూపకల్పనను ప్రశంసిస్తున్నారు.