సంతాన నియంత్రణ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మహిళలకే పరిమితమైన గర్భనిరోధక మాత్రలను పురుషుల కోసం కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. అమెరికాలోని వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకులు హార్మోన్లతో సంబంధం లేని (నాన్-హార్మోనల్) ఒక ప్రయోగాత్మక మాత్రను అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేవలం 30 నిమిషాల్లోనే పనిచేయడం దీని ప్రత్యేకత.

ఎలా పనిచేస్తుంది?
ఈ మాత్ర 'సోల్యుబుల్ అడినైలిల్ సైక్లేస్' (sAC) అనే ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. శుక్రకణాలు చురుగ్గా కదులుతూ అండం వైపు ఈదుకుంటూ వెళ్లడానికి ఈ ఎంజైమ్ చాలా కీలకం. ఈ మాత్రను తీసుకున్నప్పుడు, అది sAC ఎంజైమ్ పనితీరును తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఫలితంగా శుక్రకణాలు తమ కదలిక సామర్థ్యాన్ని కోల్పోయి స్తంభించిపోతాయి. దీంతో అవి గర్భధారణకు కారణం కాలేవు.

లైంగిక చర్యకు సుమారు అరగంట ముందు ఈ మాత్రను వేసుకుంటే సరిపోతుంది. దీని ప్రభావం సుమారు 6 నుంచి 8 గంటల పాటు ఉంటుందని, ఆ తర్వాత శుక్రకణాలు తిరిగి తమ సహజమైన కదలిక సామర్థ్యాన్ని పొందుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హార్మోనల్ పద్ధతులు శుక్రకణాల ఉత్పత్తిని నెలల తరబడి నిలిపివేస్తే, ఈ 'ఆన్-డిమాండ్' మాత్ర మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే శుక్రకణాల కదలికను తాత్కాలికంగా ఆపుతుంది.

పరిశోధనల పురోగతి
జోచెన్ బక్, లోనీ లెవిన్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఇప్పటికే ఎలుకలపై ప్రాథమిక అధ్యయనాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మాత్ర వాడిన ఎలుకలలో శుక్రకణాల కదలిక ఆగిపోవడం, గర్భధారణ జరగకపోవడాన్ని గమనించారు. 24 గంటల్లోనే వాటి పునరుత్పత్తి సామర్థ్యం తిరిగి సాధారణ స్థాయికి చేరింది. ఈ ప్రయోగాల్లో ఎలుకలపై ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు అదనపు నిధులు సమకూరడంతో, తదుపరి దశలో మానవులపై ప్రయోగాలకు ముందు జరపాల్సిన భద్రతా పరీక్షలపై దృష్టి సారించారు. మానవులపై దీని భద్రత, సమర్థత, విశ్వసనీయతను నిర్ధారించడానికి చాలా విస్తృతమైన పరీక్షలు అవసరమని, అవి పూర్తయ్యాకే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.