జింబాబ్వే సీనియర్ బ్యాటర్ క్రెయిగ్ ఇర్విన్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఘనంగా చాటిచెప్పాడు. 41 ఏళ్ల వయసులో బ్యాట్ ఝుళిపించి టెస్టు క్రికెట్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఎర్విన్ ఈ అరుదైన ఘనతను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలోనే సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన జింబాబ్వే ఆటగాడిగా ఇర్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇర్విన్ 41 ఏళ్ల 82 రోజుల వయసులో తన టెస్టు కెరీర్‌లో 5వ శతకాన్ని నమోదు చేశాడు. విశేషమేమిటంటే, ఇదే టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ సాధించిన రికార్డును ఇర్విన్ రెండో ఇన్నింగ్స్‌లోనే బద్దలు కొట్టాడు. ప్రస్తుత శతాబ్దంలో (21వ శతాబ్దం) టెస్టుల్లో సెంచరీ సాధించిన రెండో అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా కూడా ఇర్విన్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ అగ్రస్థానంలో ఉన్నాడు. మిస్బా 2016లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌పై 42 ఏళ్ల 47 రోజుల వయసులో 114 పరుగులు చేశాడు. అంతేకాకుండా, ఇదే ఇన్నింగ్స్ ద్వారా ఇర్విన్ టెస్టుల్లో 2,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. జింబాబ్వే తరఫున ఈ మార్కును దాటిన ఏడో బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ పోరు డ్రా దిశగా ముగుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే జట్టు 504 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్రెండన్ టేలర్ 168 బంతుల్లో 131 పరుగులు చేయగా, కెప్టెన్ బ్రయాన్ బెన్నెట్ 128 పరుగులతో రాణించారు. వెస్లీ మధెవెరె అర్ధసెంచరీతో ఆకట్టుకున్నారు. దీనికి సమాధానంగా ఆఫ్ఘనిస్థాన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 514 పరుగులు చేసి, 10 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో సెదిఖుల్లా అటల్ (105), రహ్మానుల్లా జద్రాన్ (113), కెప్టెన్ రహ్మత్ షా (173) అద్భుత సెంచరీలతో చెలరేగారు.

రెండో ఇన్నింగ్స్‌లో కూడా జింబాబ్వే బ్యాటర్లు పట్టువిడవకుండా ఆడారు. బ్రెండన్ టేలర్ 82 పరుగులు చేయగా, బ్రయాన్ బెన్నెట్ 58 పరుగులు జోడించారు. అనంతరం క్రెయిగ్ ఎర్విన్ అజేయ సెంచరీతో నిలవగా, అంతుమ్ నఖ్వీ 62 పరుగులతో చక్కని సహకారం అందించారు. ఐదో రోజు టీ విరామ సమయానికి జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో ఇంకా కేవలం ఒకే ఒక్క సెషన్ మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమైంది.