స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురంలో ఓడిపోయే అవకాశమే లేదని, అయినప్పటికీ అక్కడ కూటమికి ఓటమి ఎదురుకావడంపై సమగ్రంగా సమీక్షించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమికి ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించినప్పటికీ, ఒకటిరెండు ప్రాంతాల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆయన సమగ్రంగా మాట్లాడారు. అనంతపురం ఓటమిపై లోతైన విశ్లేషణ జరుపుతామని, అక్కడ ఎందుకు ఓడిపోయామో వాస్తవాల ఆధారంగా పరిశీలించి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో తాము ఎప్పుడూ ముందుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కుప్పంలో ఒక ఎంపీటీసీ స్థానంలో కూటమి ఓడిపోయినప్పటికీ, తాము కక్కుర్తి పడలేదని అన్నారు. ఆ ప్రజా తీర్పును శిరసావహించామే తప్ప అనైతిక పద్ధతుల్లో ఆ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడే అసలైన ప్రజాభిప్రాయం వెల్లడవుతుందనేది తమ సిద్ధాంతమని చెప్పారు. 

ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ సాకులతో న్యాయస్థానాలను ఆశ్రయించిందని, అయితే వారి కుట్రలను సుప్రీంకోర్టు సైతం తిప్పికొట్టిందని గుర్తుచేశారు. హింస, విధ్వంసకర రాజకీయాలకు ప్రజాతీర్పుతో కాలం చెల్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులపై బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టేందుకు అందరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అరకు కాఫీ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎన్నో ప్రణాళికలు అమలు చేశామని గుర్తుచేశారు. అయినప్పటికీ అక్కడ ఫలితాలు ఎందుకు అనుకూలంగా రాలేదో పరిశీలిస్తామని, ఓటర్లపై ఏమైనా ప్రలోభాల ప్రభావం పడిందా అనే కోణంలోనూ ఆరా తీస్తామని వివరించారు. 

ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు మెజారిటీ పెరిగినప్పుడు మరింత అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కూటమి నిర్ణయాలను ఉల్లంఘించి ఎన్నికల్లో వ్యవహరించిన రెబల్స్ విషయంలో కఠినంగా ఉంటామని, వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి పార్టీల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మరోవైపు, స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం అందించిన రెండున్నరేళ్ల సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఘనమైన ఆమోదమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 'గుడ్ గవర్నెన్స్ లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్' అనేది తమ బలమైన నమ్మకమని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే వారు రాజకీయంగా అండగా నిలుస్తారని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. 

2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కూటమికి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని, వైసీపీని ప్రజలు గతానికంటే ఎక్కువగా తిరస్కరించారని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలు, పరిషత్ పోరు.. ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలు ఇలా ఏ విధానంలో చూసినా ప్రజలు కూటమికే సంపూర్ణ మద్దతు పలికారన్నారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు.

పెళ్లి సంబంధం కుదుర్చుకునే సమయంలో ఇరువైపులా ఏడు తరాలు ఎలా చూస్తారో, ప్రజలు కూడా అలాగే అభ్యర్థుల గుణగణాలు, నేపథ్యాన్ని లోతుగా పరిశీలించి విజ్ఞతతో ఓటు వేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులతో కరవు నివారణ చర్యలు చేపట్టామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులతో ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తున్నామని చెప్పారు. 

ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు ఇళ్ల పట్టాలు అందించామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందించామని, పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు గోదావరి జలాలు తరలించామని వివరించారు. ఈ అభివృద్ధిని గుర్తించిన ప్రజలు మార్కాపురంలో 21కి 21, అనకాపల్లిలో 24కి 24 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమిని గెలిపించారని, విశాఖ మేయర్ పీఠాన్ని దాదాపు 2.50 లక్షల భారీ ఓట్ల మెజారిటీతో కట్టబెట్టారని వివరించారు.