ప్రజాస్వామ్యబద్ధంగా, అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిరూపించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎటువంటి భయభ్రాంతులు, ప్రలోభాలు లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అందుకే కూటమికి ఇంతటి అపూర్వమైన విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఓట్ల సరళి, అభ్యర్థుల ఎంపికలో చూపిన సామాజిక న్యాయాన్ని గణాంకాలతో సహా ముఖ్యమంత్రి సమగ్రంగా విశ్లేషించారు.

పులివెందులలో దశాబ్దాల తర్వాత స్వేచ్ఛా వాయువులు
ప్రజాస్వామ్యం వెల్లివిరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కడప జిల్లా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖపట్నంలో 2.47 లక్షలు, విజయవాడలో 1.30 లక్షలు, గుంటూరులో 96 వేలకు పైగా మెజారిటీలతో నగరాలు కూటమిని ఆదరించాయన్నారు. ముఖ్యంగా దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేశారని, ఫలితంగా 13,875 ఓట్ల భారీ మెజారిటీతో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవితో పాటు 40 వార్డుల్లో 37 వార్డులను కూటమి కైవసం చేసుకుందని తెలిపారు. 

కడప కార్పొరేషన్‌లో 65,588 ఓట్ల ఆధిక్యంతో పాటు 66 వార్డుల్లో 64 స్థానాల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారన్నారు. కడప జిల్లాలోని మొత్తం 9 పట్టణ స్థానిక సంస్థలనూ ప్రజలు కూటమి చేతిలో పెట్టారని, రౌడీ రాజకీయాలకు ప్రజలు శాశ్వతంగా చరమగీతం పాడారని పేర్కొన్నారు.

2024 కంటే పెరిగిన ప్రజాదరణ
పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కలిపి కూటమి పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) ఏకంగా 58.9 శాతం ఓట్లను సాధించాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, తాజా ఎన్నికల్లో అది మరో 3.6 శాతం పెరగడం ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్ర అని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56 శాతానికి పడిపోయిందని, ఆ పార్టీ 6.25 శాతం ఓట్లను కోల్పోయిందని వివరించారు. 

కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో ఏకంగా 25.34 శాతం అంతరం ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో కూటమి 59.9 శాతం ఓట్లతో 94 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేయగా, జెడ్పీటీసీ ఎన్నికల్లో 57.6 శాతం ఓట్లతో 87.5 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలికారనడానికి పట్టణాల్లో 65.7 శాతం, పరిషత్ ఎన్నికల్లో 62.83 శాతం పోస్టల్ బ్యాలెట్లు కూటమికే రావడమే నిదర్శనమని చెప్పారు.

పల్లె, పట్టణం... అంతటా క్లీన్‌స్వీప్
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాలకు గాను 27 జిల్లాల పరిషత్‌లను కూటమి తన ఖాతాలో వేసుకుందని చంద్రబాబు వెల్లడించారు. 659 జెడ్పీటీసీ స్థానాల్లో 575 స్థానాలను గెలుచుకోగా, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయిందన్నారు. ఎంపీటీసీల్లో మొత్తం 9,818 స్థానాలకు గాను 7,803 స్థానాలను గెలుచుకుని, రాష్ట్రంలో 90 శాతం మండల పరిషత్‌లను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

ఇక పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 100 మేయర్, చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి 94 చోట్ల విజయం సాధించింది. ఇందులో 13 మేయర్ పదవుల్లో 12, 87 చైర్‌పర్సన్ పదవుల్లో 82 దక్కాయి. పార్టీల వారీగా చూస్తే టీడీపీకి 70, జనసేనకు 20, బీజేపీకి 4 స్థానాలు లభించాయి. మొత్తం 3,941 వార్డుల్లో కూటమి 3,233 వార్డులను (82 శాతం) కైవసం చేసుకుంది. వైసీపీ కేవలం 4 మున్సిపాలిటీలకు, 558 వార్డులకే పరిమితమైందని, 22 పట్టణాల్లో ఆ పార్టీకి ఒక్క వార్డు కూడా దక్కలేదని వివరించారు.

సామాజిక న్యాయం - సరికొత్త నాయకత్వం
అధికార వికేంద్రీకరణ, సామాజిక న్యాయంలో కూటమి కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ నుంచి ఎన్నికైన 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 42 మంది (60 శాతం) మహిళలేనని వివరించారు. పది మేయర్ పదవుల్లో విశాఖ, గుంటూరు, కడప, కర్నూలు, ఒంగోలు సహా ఎనిమిది నగరాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 62.9 శాతం (44 స్థానాలు) ప్రాతినిధ్యం కల్పించామన్నారు.

రాజకీయాల్లోకి యువతను, విద్యావంతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించామని, టీడీపీ మేయర్లు, చైర్‌పర్సన్లలో 78.6 శాతం మంది ఉన్నత విద్యావంతులేనని సీఎం వెల్లడించారు. మేయర్ల సగటు వయసు 39 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. 

రాజంపేటలో 26 ఏళ్ల డాక్టర్ దొంతం గాయత్రి, మచిలీపట్నంలో 29 ఏళ్ల షేక్ అబ్దుల్ అబీదా, విజయనగరంలో 31 ఏళ్ల అవనాపు భార్గవి, విశాఖలో 32 ఏళ్ల డాక్టర్ ముక్కా శ్రావణి మేయర్లుగా బాధ్యతలు చేపట్టడం యువశక్తికి నిదర్శనమన్నారు. రాజకీయ నేపథ్యం లేని సామాన్యులకు, ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పించడం ద్వారా మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించే బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.