ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని కేశినేని చిన్ని అన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తల సమన్వయంతోనే ఈ భారీ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ముగిశాయని చెప్పారు.

కొన్ని స్థానాల్లో ఫలితాల గురించి మాట్లాడుతూ... "నాలుగు ఓట్ల తేడాతో ఒక ఎంపీటీసీ స్థానాన్ని కోల్పోయాం. మరో స్థానంలో కేవలం ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమి చెందాం. స్వల్ప తేడాతో ఓడినా ప్రజల తీర్పును గౌరవించాం" అని ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.