ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోని అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు అవసరమైన సమగ్ర విధివిధానాలను ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 158ను జారీ చేసింది. అర్హత కలిగిన ఉద్యోగులు ఒకేసారి తమ ఆప్షన్ (వన్-టైమ్ ఆప్షన్) నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది.

ఈ నిర్ణయంతో 2004 సెప్టెంబర్ 1కి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలై, ఆ తేదీ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారితో పాటు, అప్పటికే పదవీ విరమణ పొందినవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది. దాదాపు 10,715 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది.

ఓపీఎస్‌కు మారాలనుకునే అర్హులు 2026 డిసెంబర్ 31వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా తమ ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 'నిధి' పోర్టల్ ద్వారానే నిర్వహిస్తారు. ఇందుకోసం ఉద్యోగులు తమ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, జాయినింగ్ ఆర్డర్ కాపీలను జతచేయాల్సి ఉంటుంది. ఓపీఎస్ ఎంచుకున్న ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాను ప్రారంభిస్తారు.