ఎలాన్ మస్క్‌ సక్సెస్‌ వెనుక సీక్రెట్‌ ఇదే.. ‘ఎక్స్‌’ మాజీ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

ఎలాన్ మస్క్‌ సక్సెస్‌ వెనుక సీక్రెట్‌ ఇదే.. ‘ఎక్స్‌’ మాజీ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

Elon Musk work ethic and leadership style shared by Linda Yaccarino
  • మస్క్‌ పని విధానంపై యాకారినో కీలక వ్యాఖ్యలు
  • ఆలస్యం చేయకుండా వెంటనే పని మొదలు పెట్టడమే ఆయన ధోరణి అని వెల్లడి
  • సమస్య మూలాన్ని గుర్తించి పరిష్కరించడంపై దృష్టిపెడతారని వ్యాఖ్య
  • ఫస్ట్‌ ప్రిన్సిపుల్స్‌ ఆలోచనను మస్క్‌ పాటిస్తారని వెల్లడి
  • యువత మానవ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని యాకారినో సూచన
టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ వంటి సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎలాన్ మస్క్‌ పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుందని ‘ఎక్స్‌’ మాజీ సీఈఓ లిండా యాకారినో తెలిపారు. మస్క్‌లో తనను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఒక్కటేనని.. అది ‘తక్షణం పని మొదలుపెట్టాలనే తపన’ అని చెప్పారు.

ఫార్చ్యూన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకారినో.. మస్క్‌ పని తీరును వివరించారు. ఆయనకు ఏదైనా పని పూర్తి చేయడానికి క్యాలెండర్‌లో ఉన్న గడువు కోసం ఎదురుచూడటం నచ్చదని చెప్పారు. పని చేయాల్సి వస్తే వెంటనే మొదలుపెట్టాలనేది ఆయన ఆలోచనగా ఉంటుందని తెలిపారు.

“ఒక ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి డెడ్‌లైన్‌ అంటూ ప్రత్యేకంగా తేదీ ఉండదు. చేయాల్సింది ఇప్పుడే చేయాలి” అనే ధోరణితో మస్క్‌ పనిచేస్తారని యాకారినో చెప్పారు.

ఈ విధానం ఉద్యోగులు సమస్యలను చూసే తీరును కూడా మార్చుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పనిలో అనవసరమైన ప్రక్రియలు, ఆలస్యాలను పక్కనపెట్టి అసలు సమస్య ఏంటి? దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలి? అనే విషయాలపై నేరుగా దృష్టి పెట్టేలా ఈ పద్ధతి ప్రోత్సహిస్తుందని చెప్పారు.

దీన్ని ఆమె ‘ఫస్ట్‌ ప్రిన్సిపుల్స్‌ థింకింగ్‌’తో ముడిపెట్టారు. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించి, దాని మూల కారణాన్ని గుర్తించి పరిష్కారం వెతకడం ఈ ఆలోచనా విధానంలో కీలకం.

2023లో యాకారినో ‘ఎక్స్‌’లో సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి సంస్థలో మస్క్‌ తీసుకొచ్చిన మార్పులు కొనసాగుతున్నాయి. ట్విటర్‌ పేరు ‘ఎక్స్‌’గా మారింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో తప్పుడు సమాచారం, ద్వేషపూరిత కంటెంట్‌, బాట్లకు సంబంధించిన విమర్శలు కూడా సంస్థను వెంటాడాయి.

దాదాపు రెండేళ్లు ఎక్స్‌ సీఈఓగా పనిచేసిన యాకారినో 2025 జులైలో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుతం ఆమె హెల్త్‌ టెక్‌ రంగంలో పనిచేస్తున్నారు.

మస్క్‌ పని విధానంతో పాటు యువతకు కూడా యాకారినో కొన్ని సూచనలు చేశారు. కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో కొన్ని పనులు ఆటోమేటిక్‌గా మారే అవకాశం ఉందని.. అందుకే యువత సాంకేతికత సులభంగా భర్తీ చేయలేని నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక దృష్టి వంటి నైపుణ్యాలు ముఖ్యమని తెలిపారు.

సౌకర్యవంతమైన పరిస్థితుల్లోనే ఉండిపోవడం మంచిది కాదని ఆమె సూచించారు. “కంఫర్ట్‌ అంటే కాంప్లెసెన్సీ (ఉదాసీనత)” అని పేర్కొంటూ.. సవాళ్లు ఉన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యువతకు సూచించారు.
Advertisement
Elon Musk
Linda Yaccarino
X Corp
Elon Musk Success Secrets
First Principles Thinking
Tesla SpaceX

More Telugu News