ప్రముఖ నటి నిత్యా మేనన్ తన వ్యక్తిగత జీవితం, పెళ్లికి సంబంధించిన అంశాలపై వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. తాను వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన పెళ్లి ఆలోచనలు, గత సంబంధాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన అభిప్రాయాలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని నిత్యా మేనన్ పేర్కొన్నారు. "నేను పెళ్లి చేసుకోను అన్నప్పుడు చాలామంది నన్ను వివాహానికి వ్యతిరేకి అని భావించారు. కానీ నా ఉద్దేశం అది కాదు. నాకూ పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. అయితే కేవలం పెళ్లి చేసుకోవడమే లక్ష్యం కాదు, నన్ను అర్థం చేసుకునే సరైన భాగస్వామితో మంచి బంధం ఏర్పడాలి. నాకు స్వేచ్ఛనిచ్చే వ్యక్తి దొరికితేనే వివాహం చేసుకుంటాను. లేదంటే పెళ్లి చేసుకోను" అని ఆమె స్పష్టం చేశారు.