బ్యాంకుల్లో నగదు ఫుల్‌.. ఒక్కరోజులో రూ.2.10 లక్షల కోట్లు లాగేసిన ఆర్బీఐ!

బ్యాంకుల్లో నగదు ఫుల్‌.. ఒక్కరోజులో రూ.2.10 లక్షల కోట్లు లాగేసిన ఆర్బీఐ!

Banks full of cash RBI withdraws 210 lakh crore in a single day
  • వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలం ద్వారా డబ్బు వెనక్కి తీసుకున్న ఆర్‌బీఐ
  • సగటు వడ్డీ రేటు 5.24 శాతంగా నమోదు
  • అక్టోబర్‌ 4 నాటికి మిగులు లిక్విడిటీ రూ.5.16 లక్షల కోట్లుగా అంచనా
  • గత 2 నెలలుగా వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలం ద్వారా అదనపు నగదును వెనక్కి తీసుకున్న ఆర్‌బీఐ
బ్యాంకింగ్‌ వ్యవస్థలో భారీగా ఉన్న అదనపు నగదును ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఆర్‌బీఐ) వెనక్కి తీసుకుంది. సోమవారం నిర్వహించిన రెండు ఓవర్‌నైట్‌ ‘వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో’ (వీఆర్‌ఆర్‌ఆర్‌) వేలం ద్వారా బ్యాంకుల నుంచి ఏకంగా రూ.2,10,192 కోట్లను ఆర్బీఐ వెనక్కి లాగింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు లభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని నియంత్రించేందుకు ఈ చర్య చేపట్టింది.

మొదటి వేలంలో రూ.2 లక్షల కోట్లను తీసుకునేందుకు ఆర్బీఐ నోటిఫై చేయగా.. బ్యాంకులు రూ.2,10,688 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో రూ.2,00,050 కోట్లను ఆర్బీఐ స్వీకరించింది. సగటు వడ్డీ రేటు 5.24 శాతంగా నమోదైంది.

రెండో వేలంలో మాత్రం బ్యాంకుల నుంచి స్పందన తక్కువగా వచ్చింది. రూ.50 వేల కోట్లను తీసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించగా.. కేవలం రూ.10,142 కోట్లకు బిడ్లు వచ్చాయి. వచ్చిన మొత్తం బిడ్లను ఆర్బీఐ స్వీకరించింది.

ప్రస్తుతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు నగదు భారీగా ఉంది. అక్టోబర్‌ 4 నాటికి ఈ మిగులు లిక్విడిటీ సుమారు రూ.5.16 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు నెలలుగా ఆర్బీఐ పలుమార్లు వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలాలు నిర్వహిస్తూ ఈ అదనపు నగదును తగ్గిస్తోంది. స్వల్పకాలిక రుణ మార్కెట్‌లో వడ్డీ రేట్లు రెపో రేటుకు దగ్గరగా ఉండేలా చూడటం కూడా దీని లక్ష్యం.

విదేశాల్లో ఉన్న భారతీయులు బ్యాంకుల్లో జమ చేసిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లతో పాటు.. నెలాఖరులో ప్రభుత్వం జీతాలు, పెన్షన్ల కోసం చేసే చెల్లింపులు కూడా బ్యాంకుల్లో నగదు లభ్యతను పెంచాయి. లిక్విడిటీ ఇంకా ఎక్కువగానే ఉండటంతో.. రానున్న రోజుల్లోనూ వీఆర్‌ఆర్‌ఆర్‌ వంటి చర్యలను ఆర్బీఐ కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

వీఆర్‌ఆర్‌ఆర్‌ అంటే ఏమిటి?
వీఆర్‌ఆర్‌ఆర్‌ అంటే ‘వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో’. బ్యాంకుల దగ్గర అవసరానికి మించి నగదు ఉన్నప్పుడు.. ఆ అదనపు డబ్బును కొంతకాలం ఆర్‌బీఐ వద్ద ఉంచుకునే విధానమే వీఆర్‌ఆర్‌ఆర్‌. ఇందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. వడ్డీ రేటు ముందే నిర్ణయించకుండా వేలం ద్వారా ఖరారు చేస్తారు. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనంగా ఉన్న నగదు కొంతకాలం మార్కెట్‌ నుంచి బయటకు వెళుతుంది. తద్వారా స్వల్పకాలిక వడ్డీ రేట్లను నియంత్రించేందుకు ఆర్‌బీఐకి వీలు కలుగుతుంది.

డబ్బు ఎలా వెనక్కి తీసుకుంటుంది?
ఆర్‌బీఐ ముందుగా వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలాన్ని ప్రకటిస్తుంది. ఎంత మొత్తాన్ని తీసుకోవాలనుకుంటుందో చెబుతుంది. బ్యాంకులు తమ దగ్గర ఉన్న అదనపు నగదులో ఎంత మొత్తాన్ని ఇవ్వగలవో, ఏ వడ్డీ రేటుకు ఇవ్వాలనుకుంటున్నాయో బిడ్లు వేస్తాయి. ఆర్‌బీఐ ఎంపిక చేసిన బిడ్లను స్వీకరించి ఆ మొత్తాన్ని తాత్కాలికంగా తన వద్దకు తీసుకుంటుంది. గడువు ముగిసిన తర్వాత అసలు మొత్తాన్ని వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంది. అంటే ఆర్‌బీఐ బ్యాంకుల డబ్బును శాశ్వతంగా తీసుకోదు.. కొంతకాలం తన వద్ద ఉంచుకుని లిక్విడిటీని నియంత్రిస్తుంది.
Advertisement
Reserve Bank of India
Variable Rate Reverse Repo
Banking liquidity
VRRR auction
Indian banks
Monetary policy

More Telugu News