దేశంలో విమాన ప్రయాణాలు మరింత భారంగా మారాయి. 2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విమాన ప్రయాణ సేవల ధరలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 35.52 శాతం మేర పెరిగాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (SPPI) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న ఏడు ప్రధాన సేవా రంగాల్లో ఇదే అత్యధిక ధరల పెరుగుదల కావడం గమనార్హం.

2022-23ను ఆధార సంవత్సరంగా తీసుకుని రూపొందించిన ఈ గణాంకాల ప్రకారం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 31.94 శాతంగా ఉన్న విమానయాన ధరల ద్రవ్యోల్బణం, జులై-సెప్టెంబర్ నాటికి మరింత పెరిగింది. ఈ త్రైమాసికంలో ఎయిర్ (ప్యాసింజర్) సర్వీస్ ప్రైస్ ఇండెక్స్ 126.4 నుంచి 127.8కి పెరిగింది. అంటే, కేవలం మూడు నెలల వ్యవధిలోనే 1.1 శాతం వృద్ధి నమోదైంది.

ఒకవైపు విమాన ప్రయాణ ధరలు ఆకాశాన్నంటుతుంటే, మరోవైపు కొన్ని సేవల ధరలు తగ్గుముఖం పట్టడం ఆసక్తికరం. సెక్యూరిటీల లావాదేవీల సేవల ధరలు 6.93 శాతం క్షీణించగా, బ్యాంకింగ్ సేవల ధరల సూచీ 3.96 శాతం తగ్గింది. అయితే, బ్యాంకింగ్ సేవల కంట్రిబ్యూషన్ ఇండెక్స్ మాత్రం 3.86 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇతర సేవల రంగాల్లో ధరల పెరుగుదల స్వల్పంగా ఉంది. రైల్వే సేవల ధరలు మొత్తంగా 1.38 శాతం పెరగ్గా, అందులో ప్యాసింజర్ సేవల ధరలు 2.17 శాతం, సరుకు రవాణా ధరలు 0.99 శాతం పెరిగాయి. పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ సేవలు 1.01 శాతం, టెలికమ్యూనికేషన్స్ 0.54 శాతం, ఇన్సూరెన్స్ సేవలు 0.49 శాతం చొప్పున స్వల్పంగా పెరిగాయి.

విమాన టికెట్ల ధరల పెరుగుదలకు గల కారణాలను ప్రభుత్వం తన నివేదికలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల వల్ల పెరిగిన ఇంధన ధరలే ఇందుకు కారణమని కొన్ని నివేదికలు విశ్లేషిస్తున్నాయి. కాగా, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన తర్వాతి నివేదికను 2027, ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.