పుణ్యక్షేత్రాల సందర్శనపై ఆసక్తి ఉన్న భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త ఎయిర్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి "గంగా రామాయణ్ యాత్ర" పేరుతో ఈ టూర్‌ను ప్రకటించారు. 5 రాత్రులు, 6 పగళ్ల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్రలో వారణాసి (కాశీ), ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శించవచ్చు.

డిసెంబర్ 16, వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 తేదీల్లో ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణ వివరాల ప్రకారం.. యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 10:25 గంటలకు ఇండిగో విమానం (6E 915) ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు వారణాసి చేరుకుంటారు. తొలి రోజు కాశీ విశ్వనాథ ఆలయ దర్శనం, గంగా హారతి తిలకిస్తారు. అనంతరం సారనాథ్, బిర్లా టెంపుల్, ప్రయాగ్‌రాజ్‌లోని అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి అయోధ్య, లక్నో, నైమిశారణ్యం క్షేత్రాల దర్శనం ముగించుకుని, లక్నో విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. డిసెంబర్ ట్రిప్‌కు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.46,050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.34,300గా నిర్ణయించారు. ఫిబ్రవరి ట్రిప్‌కు ఈ ధరలు వరుసగా రూ.47,100, రూ.36,400, రూ.34,700గా ఉన్నాయి. ఈ ప్యాకేజీలో రానుపోను విమాన టిక్కెట్లు, ఏసీ హోటల్‌లో బస, 5 అల్పాహారాలు, 5 రాత్రి భోజనాలు, సందర్శనీయ ప్రాంతాలకు ఏసీ బస్సు ప్రయాణం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి అంతర్భాగంగా ఉంటాయి. అయితే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అదనపు భోజనం, గైడ్ సేవలు, వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేవలం 29 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.