ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, తన గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా భారత్ నుంచి ఎగుమతులలో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ ప్రోగ్రామ్ ద్వారా భారత్ నుంచి జరిగిన మొత్తం ఈ-కామర్స్ ఎగుమతుల విలువ 27 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.49 లక్షల కోట్లు) చేరుకుందని కంపెనీ నేడు ప్రకటించింది.

2015లో ప్రారంభమైన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమం, భారతీయ వ్యాపారులకు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు ఒక వేదికగా నిలుస్తోంది. గత 11 ఏళ్లలో 2.4 లక్షల మందికి పైగా భారతీయ ఎగుమతిదారులు ఈ కార్యక్రమంలో చేరారు. వీరంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు 100 కోట్లకు పైగా 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను విక్రయించారు. 

గతేడాదితో పోలిస్తే ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎగుమతిదారుల సంఖ్య 20 శాతం పెరిగింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 200కు పైగా నగరాలు, పట్టణాల నుంచి విక్రయదారులు తమ ఉత్పత్తులను అమెరికా, యూకే, జర్మనీ, యూఏఈ, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ సహా 18 దేశాల అంతర్జాతీయ అమెజాన్ స్టోర్ల ద్వారా విక్రయిస్తున్నారు.

ఈ మైలురాయిపై అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ఇండియా హెడ్ శ్రీనిధి కల్వపూడి మాట్లాడుతూ.. "వినియోగ వస్తువుల ఎగుమతులలో భారత్ గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారే సామర్థ్యం ఉంది. ఈ-కామర్స్ ఆ లక్ష్యాన్ని నిజం చేయడంలో సహాయపడుతోంది. 2030 నాటికి 80 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 7.38 లక్షల కోట్లు) ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడానికి మేం కృషి చేస్తున్నాం. భారత ప్రభుత్వ 'బ్రాండ్ ఇండియా' విజన్‌కు మద్దతుగా ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, భాగస్వామ్యాల ద్వారా గ్లోబల్ సెల్లింగ్‌ను మరింత సులభతరం చేస్తాం" అని వివరించారు.

2026లో ఈ ప్రోగ్రామ్‌లో అపెరల్ (వస్త్రాలు), హోమ్ టెక్స్‌టైల్స్ విభాగాలు ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలిచాయని కంపెనీ తెలిపింది. వస్త్రాల విభాగంలో 23 శాతం, గృహోపకరణాల విభాగంలో 30 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని భదోహీలో రగ్గుల తయారీదారులకు మద్దతుగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే, అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ), కార్పెట్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఈపీసీ), టెక్స్‌ప్రొసిల్ (TEXPROCIL) వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఎగుమతి అవకాశాలను విస్తరిస్తోంది.