ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాజధాని అమరావతిలోని ఏపీ డీజీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో, లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు పునరావాస సహాయం కింద మొత్తం రూ. 75 లక్షల డిమాండ్ డ్రాఫ్టులను (డీడీలు) ఆయన స్వయంగా అందజేశారు.

లొంగిపోయిన వారిలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు జోరిగ నాగరాజు అలియాస్ కమలేశ్, ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, పది మంది ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు దళ సభ్యులు ఉన్నారు. నాగరాజుకు రూ. 20 లక్షలు అందజేయగా, మిగిలిన 17 మందికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ. 2.87 కోట్ల రివార్డులో ఇప్పటికే రూ. 91 లక్షలు అందించామని, నేడు రూ. 75 లక్షలు ఇచ్చామని డీజీపీ చెప్పారు. లొంగిపోయిన మరో 32 మందికి రూ. 1.21 కోట్ల ఆర్థిక సహాయాన్ని త్వరలోనే అందిస్తామని స్పష్టం చేశారు.

గత రెండున్నరేళ్ల కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారని, 73 మందిని పోలీసులు అరెస్టు చేశారని డీజీపీ వివరించారు. హింస ద్వారా ఏదీ సాధించలేమనే భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రధాన స్రవంతిలోకి వచ్చిన వారి జీవనోపాధిపై నిరంతరం ఆరా తీస్తున్నామని తెలిపారు. 

మరోవైపు మన్యం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, సరళ్, ప్రేరణ, స్ఫూర్తి వంటి కార్యక్రమాల ద్వారా వేలాది మంది యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీలో 169 రహదారులు, 39 వంతెనల నిర్మాణం చేపట్టామని, 2,090 మొబైల్ టవర్లతో 96 శాతం గ్రామాలకు నెట్‌వర్క్ కనెక్టివిటీ కల్పించినట్లు డీజీపీ వెల్లడించారు. సరిహద్దుల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.