శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కాలంలో చల్లటి గాలులు, ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల సాధారణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఆస్తమా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఈ సీజన్‌లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా రక్తపోటు (బీపీ) బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. చలికాలంలో దాహం తక్కువగా అనిపించినప్పటికీ శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. చాలామంది దాహం వేయడం లేదని నీరు తాగడం తగ్గిస్తుంటారు, దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది.

చలికాలంలో రైనోవైరస్ (Rhinovirus), ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వంటి వైరస్‌లు వాతావరణంలో వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇవి శరీర శ్వాసకోశంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అలాగే చల్లని, పొడి గాలి పీల్చడం వల్ల గొంతులోని శ్లేష్మ పొర పొడిబారి గొంతునొప్పి, మంట, వాపు వస్తాయి. ఆస్తమా బాధితులకు ఈ కాలంలో మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. చల్లని గాలి కారణంగా శ్వాసనాళాలు సంకోచించి (Bronchoconstriction) దగ్గు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.

మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గడంతో శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి (Vasoconstriction). ఫలితంగా రక్తపోటు పెరిగి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. రక్తపోటు బాధితులు చలికాలంలో నిరంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పులతో కండరాలు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలం బిగుతుగా మారడం, చలి కారణంగా శారీరక కదలికలు తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల చర్మం నుంచి నీరు త్వరగా ఆవిరైపోయి చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం, దురద వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన నియమాలు

చేయాల్సినవి: బయటకు వెళ్లేటప్పుడు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను తప్పనిసరిగా ధరించాలి. రోగనిరోధక శక్తిని పెంచే తాజా పండ్లు, ఆకుకూరలతో కూడిన పోషకాహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఉండేందుకు మంచి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.
చేయకూడనివి: తీవ్రమైన చలిలో తగిన జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్లకూడదు. దాహం వేయడం లేదనే కారణంతో నీరు తాగడం పూర్తిగా నిర్లక్ష్యం చేయరాదు. పొగ, దుమ్ము, ధూళి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా స్వయం వైద్యం జోలికి వెళ్లకుండా, అర్హులైన వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

సరైన జాగ్రత్తలు, జీవనశైలి మార్పులను అలవరచుకుంటే చలికాలంలోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.