సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఏర్ప‌డి 222 ఏళ్లు పూర్త‌వ‌డం, రాజమండ్రి బార్ అసోసియేషన్‌ 131 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వ‌హించిన‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలోనే కాకుండా న్యాయవ్యవస్థలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 'లీగల్ ఏఐ స్టాక్'ను త్వరలోనే అమలు చేస్తామని ప్ర‌క‌టించారు.

తాటి ఆకులపై తీర్పుల నుంచి నేటి ఏఐ సాంకేతికత వరకు న్యాయవ్యవస్థ ఎంతో రూపాంతరం చెందిందన్నారు. పన్నుల వసూళ్లలో ఏఐతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, అదే స్ఫూర్తితో న్యాయపాలన, వ్యాజ్యాల నిర్వహణ కోసం 'లీగల్ ఏఐ స్టాక్' తీసుకువస్తామని వివరించారు. దీని ద్వారా జీవోలు, చట్టాలు, కేసు రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు ఏఐ సాయంతో కేసుల విశ్లేషణ, కౌంటర్ అఫిడవిట్ల తయారీ వంటివి సులభతరం అవుతాయని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా 8.4 లక్షల కేసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యతను చంద్రబాబు గుర్తుచేశారు. ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులు, బ్రిటిష్ వారికే గుండె చూపిన టంగుటూరి ప్రకాశం పంతులు, ఇక్కడే ప్రాక్టీస్ చేసి భారత 9వ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ కోకా సుబ్బారావు వంటి గొప్పవారిని ఈ ప్రాంతం అందించిందని కొనియాడారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తవుతుందని, త్వరలో రానున్న గోదావరి పుష్కరాలకు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఆయన సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అప్పటి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తన తీర్పుతో అమరావతిని, రాష్ట్రాన్ని కాపాడిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను, ఏపీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్‌ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలు పటిష్ఠంగా ఉండటం వల్లే ప్రపంచ సంక్షోభంలోనూ భారత్ స్థిరంగా ఉందని, 2047 నాటికి దేశం 'వికసిత్ భారత్'గా, ఏపీ 'స్వర్ణాంధ్ర'గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.