పెరూలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజధాని లిమాకు సమీపంలో పట్టపగలే జరిగిన భారీ దోపిడీలో ఓ భారత పౌరుడితో పాటు స్థానిక మహిళ గాయపడ్డారు. నగలతో వెళుతున్న వీరి వాహనాన్ని అడ్డగించిన సాయుధ దుండగులు, కాల్పులకు తెగబడ్డారు.

వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల భారత జాతీయుడు విజయ్ పగ్రానీ ఇజా, 35 ఏళ్ల పెరూ మహిళ మారి నాటలీ మిరాండా ఎస్పినోజా.. నగల ప్యాకేజీలతో జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కారులో వెళుతున్నారు. కోస్టా వెర్డే హైవేపై శాంటా రోసా అవెన్యూ వద్ద ముసుగులు ధరించిన కొందరు దుండగులు వీరి వాహనాన్ని అడ్డగించారు. కారు కిటికీలపై కాల్పులు జరిపి, నగలు ఉన్న బ్రీఫ్‌కేసులతో పరారయ్యారు.

ఈ దాడిలో విజయ్, ఎస్పినోజా ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే శాన్ జుడాస్ టాడియో క్లినిక్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎనిమిది వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బంగారం కడ్డీలే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.