కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతం తీసుకునే ఓ మహిళ.. ఆఫీస్ వేళలు ముగిశాక కొబ్బరికాయల వ్యాపారం చేసి ఏకంగా రూ.1.17 కోట్ల నగదు కూడబెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్దమొత్తంలో బ్యాంకులో నగదు జమ కావడంతో ఆదాయపు పన్ను శాఖ కన్ను ఆమెపై పడింది. ఆ సొమ్మును 'లెక్కల్లో చూపని నగదు'గా పరిగణిస్తూ అధికారులు షాక్ ఇచ్చారు. అయితే చెన్నై ఐటీఏటీ (ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్) తలుపు తట్టిన ఆ మహిళకు అక్కడ ఊరట లభించింది.

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన అనిత ప్రముఖ సంస్థలో పని చేస్తూ ఏటా రూ.25 లక్షల జీతం అందుకుంటున్నారు. ఆఫీస్ సమయం పూర్తయ్యాక ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో కన్యాకుమారి జిల్లాలో కొబ్బరి వ్యాపారంలోకి దిగారు. రైతుల వద్ద నుంచి కొబ్బరి తోటలను లీజుకు తీసుకోవడం, కూలీలను పెట్టి కాయలు కోయించడం చేసేవారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతుల వద్ద నుంచి తాజా కొబ్బరికాయలను నేరుగా కొనుగోలు చేసి, వాటిపై పీచు తొలగించి మార్కెట్లో విక్రయించేవారు.

ఈ వ్యాపారం బాగా పుంజుకోవడంతో 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆమె తన బ్యాంకు ఖాతాలో రూ.1.17 కోట్ల నగదు జమ చేశారు. కేవలం ఉద్యోగం చేస్తూ జీతం తీసుకునే సాధారణ మహిళ ఖాతాలో ఇంత పెద్దమొత్తం నగదు జమ కావడాన్ని గుర్తించిన అసెస్సింగ్ ఆఫీసర్ (ఏవో) ఆమె కేసును స్క్రూటినీకి తీసుకున్నారు.

విచారణలో అనిత ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించారు. కొబ్బరి విక్రయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా భావించినట్లు ముందుగా తెలిపారు. ఆ తర్వాత అప్‌డేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసి, సెక్షన్ 44ఏడీ కింద ప్రిజంప్టివ్ పద్ధతిలో వ్యాపార ఆదాయంగా చూపించారు. రూ.1.277 కోట్ల టర్నోవర్‌పై 8 శాతంగా రూ.10.216 లక్షల ఆదాయాన్ని ప్రకటించారు. అయితే ఆమె వద్ద ఎలాంటి ఖాతా పుస్తకాలు, బిల్లులు లేకపోవడంతో ఆ రూ.1.17 కోట్ల నగదు మొత్తాన్ని లెక్క చూపని ఆదాయంగా నిర్ధారిస్తూ అధికారి పన్ను విధించారు.

దీంతో చార్టర్డ్ అకౌంటెంట్ కె.విశ్వ పద్మనాభన్ సహాయంతో అనిత చెన్నై ఐటీఏటీని ఆశ్రయించారు. బ్యాంకు ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో జరిగిన లావాదేవీలు, డిపాజిట్లు వ్యాపార సరళికి తగినట్లే ఉన్నాయని ట్రిబ్యునల్ గుర్తించింది. రైతులు, సరఫరాదారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు వ్యాపారం వాస్తవమేనని నిరూపించాయి. ఇప్పటికే ఐటీఆర్-యు ద్వారా టర్నోవర్ చూపించినప్పుడు, దాన్ని పక్కనపెట్టి మొత్తం సొమ్ముపై పన్ను వేయడం సరైంది కాదని స్పష్టం చేసింది.

అయితే కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ఆమెకు పాక్షిక ఉపశమనం మాత్రమే దక్కింది. రూ.1.177 కోట్ల మొత్తంలో 8 శాతం అంటే రూ.9.416 లక్షలను అదనపు వ్యాపార ఆదాయంగా జోడించి పన్ను లెక్కించాలని అసెస్సింగ్ అధికారిని ట్రిబ్యునల్ ఆదేశించింది.