కోకాపేట, బుద్వేల్ భూముల వేలంతో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు అదే బాటలో మరో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన మియాపూర్ ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి, విక్రయించడం ద్వారా భారీగా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లలో ఉన్న భూముల్లో మెగా లేఅవుట్ అభివృద్ధి చేసే బాధ్యతను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు అప్పగించింది.

దాదాపు 23 సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తులు, సొసైటీలతో నడిచిన న్యాయపోరాటంలో ఇటీవలే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. మొత్తం 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేయడంతో, ఈ భూములను అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమమైంది. తీర్పు అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి భూములను స్వాధీనం చేసుకున్నారు. ముంబై జాతీయ రహదారికి కేవలం అర కిలోమీటరు దూరంలో ఉండటంతో ఈ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న భూమిలో సుమారు 110 నుంచి 150 ఎకరాల వరకు ఆక్రమణల్లో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే బస్తీలు, కాలనీలు వెలిశాయి. వీటిని ప్రస్తుతానికి తొలగించే పరిస్థితి లేనందున, దీనిపై ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆక్రమణలు పోగా, సుమారు 386 నుంచి 400 ఎకరాల భూమి లేఅవుట్ అభివృద్ధికి అందుబాటులో ఉంది. ఈ భూమిలో విశాలమైన రహదారులు, పార్కులు, గ్రీన్‌ స్పేస్, ఇతర సామాజిక మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

లేఅవుట్ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ. 600 నుంచి 700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అభివృద్ధి పనులు పూర్తయ్యాక, కోకాపేట నియోపొలిస్ తరహాలోనే ఇక్కడ కూడా ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తుందని, ఆ నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే లేఅవుట్ అభివృద్ధి పనులు ప్రారంభించి, వేలానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది.