ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవవచ్చని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొన్నారు.

ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షం కురిసే వేళ ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి గుంటూరు జిల్లా తెనాలిలో అత్యధికంగా 29.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ., తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ., గుంటూరు జిల్లా వడ్లమూడిలో 20.8 మి.మీ., నెల్లూరు రూరల్‌ ప్రాంతంలో 20 మి.మీ. మేర వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు.