హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు 73 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హఠాత్తుగా మూర్ఛ రావడంతో ఓ ప్రయాణికుడు అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ఈ సాహసోపేత ఘటన కాజీపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

హనుమకొండ నుంచి గురువారం మధ్యాహ్నం 2:25 గంటలకు బయలుదేరిన ఎలక్ట్రిక్‌ బస్సు, కాజీపేట బాపూజీనగర్‌ చౌరస్తా వద్దకు రాగానే డ్రైవర్‌ రాజుకు ఫిట్స్ వచ్చాయి. దీంతో అతడు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పింది. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.

వెంటనే స్పందించిన కండక్టర్‌ విజయ్‌, బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో బస్సులో ఉన్న జనగామ వాసి రామకోటి అనే ప్రయాణికుడు ముందుకు దూసుకొచ్చారు. కండక్టర్‌తో కలిసి డ్రైవర్‌ను పక్కకు జరిపి, స్టీరింగ్‌ను అదుపులోకి తీసుకుని బ్రేకులు వేసి బస్సును నిలిపివేశారు. దీంతో 73 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, బస్సు అదుపుతప్పే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఆగమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో మహిళను ఢీకొట్టింది. వారికి స్వల్ప గాయాలయ్యాయి.

అదే మార్గంలో వెళ్తున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి వెంటనే స్పందించి, గాయపడిన వృద్ధురాలిని, అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రామకోటి, కండక్టర్‌ విజయ్‌ను ఏసీపీ శాలువాతో సత్కరించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రామకోటికి ఫోన్‌లో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.