భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి అబ్బురపరిచింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఓ ప్రత్యేకమైన స్పీడ్ బ్యాటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె.. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచింది. బంతి బంతికీ వేగం పెరుగుతున్నప్పటికీ, తన అద్భుతమైన టైమింగ్, పవర్‌తో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

కెవిన్ పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్ 'ది స్విచ్' కోసం ఈ ఛాలెంజ్‌ను రూపొందించాడు. దీని నిబంధనల ప్రకారం, బ్యాటర్ 50 బంతుల్లో 100 పరుగులు చేయాలి. అయితే, తొలి బంతి గంటకు 51 మైళ్ల వేగంతో వస్తే, ఆ తర్వాత ప్రతి బంతికీ వేగం ఒక మైలు చొప్పున పెరుగుతూ ఉంటుంది. 50వ బంతి నాటికి దాని వేగం గంటకు 100 మైళ్లకు చేరుకుంటుంది. ఇంతటి కఠినమైన ఛాలెంజ్‌లో స్మృతి మంధాన తన క్లాస్ చూపించింది. పెరుగుతున్న వేగాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ, అద్భుతమైన షాట్లతో 37 బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. గతంలో శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వంటి ఆటగాళ్లు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

మంధాన ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉంది. సీనియర్ మహిళల ఇంటర్-జోనల్ టీ20 టోర్నీలో వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్న ఆమె.. రెండు ఇన్నింగ్స్‌లలో 37 పరుగులు చేసింది. అంతకుముందు జరిగిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో మూడు మ్యాచ్‌లలో 125 పరుగులతో మంచి ఫామ్‌లో కనిపించింది.

కాగా, త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత జట్టుకు స్మృతి కెప్టెన్‌గా ఎంపికైంది. ఆ జట్టుతో జరగనున్న ఏకైక టెస్టుతోపాటు మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డిసెంబర్ 9న గెబెహాలో టెస్టు మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభమై, డిసెంబర్ 30న టీ20 మ్యాచ్‌తో ముగుస్తుంది.