గోదావరి పుష్కరాలు-2027ను కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పుష్కరాల విశిష్టతను చాటే అధికారిక లోగో.. ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్ రూపకల్పన కోసం ప్రత్యేక పోటీలను ప్రకటించింది. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏ విశ్వవిద్యాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో విద్యార్థులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో గెలుపొందిన ఉత్తమ డిజైనర్లకు ప్రభుత్వం ఆకర్షణీయమైన నగదు పురస్కారాలను ప్రకటించింది. మొదటి బహుమతి కింద రూ.1 లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందజేయనున్నారు. కళాకారులు, విద్యార్థులు, డిజైనర్లతో పాటు సాధారణ ప్రజలు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను ఈ నెల 30వ తేదీలోపు godavaripushkaralutg@gmail.com అనే ఈమెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, గోదావరి నది పవిత్రత, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా లోగో, ట్యాగ్‌లైన్‌లను తీర్చిదిద్దాలని నిపుణులు సూచించారు. ఎంపికైన లోగో, ట్యాగ్‌లైన్‌ను పుష్కరాల ప్రచారంలో అధికారికంగా విస్తృతంగా వినియోగించనున్నారు.

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర పుష్కరాలకు దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, కోటిలింగాల వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు తీర ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునికీకరణ, విస్తరణ పనులపై ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా సమన్వయం చేస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రహిత పుష్కరాలుగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది.