ఇరాన్‌లో మహిళల హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వ కఠిన వైఖరిని మరోసారి చాటిచెప్పే ఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీ, ఆమె బృందంలోని నలుగురు సభ్యులకు ఇరాన్ ప్రభుత్వం 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేసింది. నవంబర్ 23న ఈ శిక్షను అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన ఇరాన్‌లో కళాకారులపై జరుగుతున్న అణచివేతకు అద్దం పడుతోంది.

2024 డిసెంబర్‌లో ఇరాన్‌లోని ఖోమ్ నగరంలో పరస్తూ అహ్మదీ, తన బృందంతో కలిసి ఓ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఆమె హిజాబ్ ధరించలేదు. ఆ ప్రదర్శనకు ప్రేక్షకులు ఎవరూ లేనప్పటికీ, ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారి మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ఈ వీడియో ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.

విచారణ చేపట్టిన ఇరాన్ న్యాయస్థానం, పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురు పురుష సంగీతకారులను దోషులుగా తేల్చింది. ప్రతి ఒక్కరికీ 74 కొరడా దెబ్బలు విధించడంతో పాటు, రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లకుండా ప్రయాణాలపై నిషేధం విధించింది. అలాగే, వారు ఎలాంటి సంగీత, కళా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనరాదని కఠిన ఆంక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 23న ఈ శిక్షను అమలు చేశారు.

2022లో హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో అరెస్టయిన మహ్సా అమిని పోలీసు కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్‌లో మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయని పరస్తూ అహ్మదీకి విధించిన శిక్షతో ఈ అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

Play video