స్మార్ట్‌ఫోన్ ద్వారా క్షణాల్లో చేతికి అందుతున్న డిజిటల్ రుణాలపై నిఘా పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నడుం బిగించింది. అదనపు రుసుములు, దాగి ఉండే ఛార్జీలు, బలవంతపు వసూళ్ల ముసుగులో కస్టమర్లను పీల్చిపిప్పి చేస్తున్న రుణ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు, సహకార బ్యాంకులు జారీ చేసే డిజిటల్ రుణాలకు సంబంధించి డీఫాల్ట్ లాస్ గ్యారెంటీ (డీఎల్‌జీ) పరిమితిని 5 శాతానికి పరిమితం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

తాజా నిబంధనల ప్రకారం.. రుణం మంజూరు చేసే సమయంలోనే వర్తించే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, దాగి ఉండే ఇతర రుసుముల వివరాలను దరఖాస్తుదారులకు పారదర్శకంగా వెల్లడించాలి. రుణం రికవరీ లేదా చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తులు, థర్డ్ పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసింది. ఖాతాదారుల నుంచి వసూలు చేసే మొత్తాలు నేరుగా ఆయా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ఖాతాల్లోకే చేరాలి.

రుణగ్రహీతలు చెల్లింపులు చేయలేకపోయినప్పుడు సంస్థలు భరించే డిఫాల్ట్ లాస్ గ్యారెంటీ మొత్తం.. సంబంధిత లోన్ పోర్ట్‌ఫోలియోలో 5 శాతానికి మించరాదని ఆర్బీఐ పరిమితి విధించింది. ఈ గ్యారెంటీ మొత్తాన్ని నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా బ్యాంక్ గ్యారెంటీ రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో, కస్టమర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించరాదని తేల్చిచెప్పింది. కేవలం రుణానికి అవసరమైన వివరాలు మాత్రమే తీసుకోవాలని, అక్రమ వసూళ్లకు లేదా వేధింపులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.