టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ మైదానంలో ప్ర‌వ‌ర్తించిన‌ తీరుపై మాజీ ఆటగాడు అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్‌పై గిల్ బహిరంగంగా ఆగ్రహం వ్య‌క్తం చేయ‌డాన్ని తప్పుబట్టాడు. ఇలాంటి సమయంలో కెప్టెన్ ఆటగాడికి మద్దతుగా నిలవాలి కానీ, తిట్టకూడదని రహానే హితవు పలికాడు.

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు ఐదో రోజు ఆటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 71వ ఓవర్లో డారిల్ మిచెల్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బంతిని మిడ్-ఆన్ వైపు కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకర్ అతడిని వెనక్కి పంపాడు. అప్పటికే సగం పిచ్ దాటిన మిచెల్‌ను రనౌట్ చేసే సువర్ణావకాశం వచ్చింది.

కానీ మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు. దీంతో కీలకమైన రనౌట్ అవకాశం చేజారింది. ఇది చూసిన కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ మైదానంలోనే ఆకాశ్ దీప్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అరిచాడు. ఈ తప్పిదం భారత్‌కు నష్టం చేసింది. ఆ తర్వాత మిచెల్ అజేయంగా 49 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ ఘటనపై సోనీ స్పోర్ట్స్ షోలో రహానే మాట్లాడుతూ.. "మైదానంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో సహచర ఆటగాళ్ల మద్దతు చాలా ముఖ్యం. ఆకాశ్ దీప్‌కు అండగా నిలవాల్సింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కన్నా, ఆటగాడిని ప్రోత్సహిస్తే తర్వాతి బంతికే వికెట్ తీయొచ్చు లేదా అద్భుతమైన క్యాచ్ పట్టొచ్చు. ఆటగాడికి మద్దతు ఇవ్వడం కెప్టెన్ బాధ్యత" అని వివరించాడు. మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కివీస్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు.