దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ప్రముఖ నటి తాప్సీ పన్ను పంచుకున్నారు. తాను తమిళం, తెలుగు సినిమాల్లో పనిచేసిన రోజుల్లో కెమెరా ముందు శరీర భాగాలు మరింత ప్రముఖంగా కనిపించేందుకు దర్శకులు హీరోయిన్లను ప్యాడెడ్ బ్రాస్ ధరించమని కోరేవారని ఆమె వెల్లడించారు. శుభాంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల ఆసక్తికి అనుగుణంగా, విజువల్ అప్పీల్ పెంచేందుకే నటన కంటే శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని ఆమె పేర్కొన్నారు.

సినిమా సెట్‌లలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, అందుకే దర్శకులు ఈ విషయాన్ని నేరుగా హీరోయిన్లకు చెప్పలేకపోయేవారని తాప్సీ వివరించారు. దర్శకుడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌కు, అక్కడి నుంచి స్టైలింగ్ లేదా హెయిర్ టీమ్‌లోని మహిళా సిబ్బందికి ఆ సమాచారం వెళ్లి, చివరకు హీరోయిన్ల వద్దకు చేరేదని తెలిపారు.

ముఖ్యంగా పాటల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మధ్యలోనే సెట్ నుంచి వెళ్లి కాస్ట్యూమ్ మార్చుకుని రావడం అత్యంత ఇబ్బందికరంగా ఉండేదని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకుని తిరిగి సెట్‌లోకి రాగానే, తమ లుక్‌లో తగినంత మార్పు వచ్చిందో లేదో అని అక్కడున్న వారంతా గమనించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకవేళ తేడా తెలియకపోతే మళ్లీ వెళ్లి మార్చుకోవాలని చెప్పే పరిస్థితులు కూడా ఉండేవని పేర్కొన్నారు. దక్షిణాది సినిమాల్లో బొడ్డుపై ఎక్కువగా దృష్టి పెడితే, హిందీ చిత్రాల్లో క్లీవేజ్‌పై ఫోకస్ పెడతారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.