హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్, డ్యాన్సర్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సప్నా చౌదరి తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తన భర్త వీర్ సాహు నుంచి విడాకులు కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 6 సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ విడాకుల అంశంపై సప్నా చౌదరి ఇటీవల ఎన్‌ఎమ్‌ఎఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ బంధం ఎందుకు ముగిసిపోయిందనే విషయం కేవలం తనకు, వీర్ సాహుకు మాత్రమే స్పష్టంగా తెలుసని ఆమె అన్నారు. సంబంధం బాగున్నంత కాలం కలిసి ఉన్నామని, పరిస్థితులు అనుకూలించనప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోవడమే సరైన మార్గమని భావించినట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా సంబంధాలు, నమ్మకం గురించి మాట్లాడుతూ.. ప్రేమ అనేది శారీరక సంబంధం మాత్రమే కాదని, అది మనసుకు, భావోద్వేగాలకు సంబంధించినదని వివరించారు. పురుషులు ప్రాక్టికల్‌గా ఉంటారని, మహిళలు మాత్రం భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెబుతూ మోసం జరిగిందన్న రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌బాస్ షో తర్వాత తనకు విపరీతమైన గుర్తింపు, ఆదరణ లభించిన సమయంలోనే వివాహం చేసుకున్నట్లు సప్నా గుర్తు చేసుకున్నారు. ఇల్లాలుగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించానని తెలిపారు. అయితే ఆ క్రమంలో తన సొంత వ్యక్తిత్వాన్ని, ఆసక్తులను పట్టించుకోవడం పూర్తిగా పక్కన పెట్టేశానని, తనకు తాను ప్రాధాన్యం ఇచ్చుకోవడం మానేశానని చివరకు గ్రహించినట్లు ఆమె వివరించారు. పెళ్లి తర్వాత గుర్తింపును కోల్పోయానని చెప్పారు.