ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న ఓ వ్యక్తిని కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కూరపాటి రవీంద్రబాబు అలియాస్ రవీంద్రగా గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గత నెల 13న పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు స్థానిక పోలీసులకు దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. "ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నాడు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, అవమానకరంగా వాఖ్యలు, వ్యంగ్యపూరిత కాప్షన్లతో ప్రచారం చేస్తున్నాడు" అని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి కదలికలను గుర్తించారు. బుధవారం పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ సమీపంలో రవీంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఐటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై తదుపరి చర్యలు చేపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేసిన సీఐ సత్యనారాయణ, పోలీసు బృందాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.