ప్రముఖ నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మైసా' విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే థియేటర్లలోకి రావడానికి సరిగ్గా ఐదు రోజుల ముందు మేకర్స్ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ 'అన్‌ఫార్ములా ఫిల్మ్స్', దర్శకుడు రవీంద్ర పుల్లే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సంయుక్తంగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. "తెలుగు సినిమా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరమైన దశలోకి ప్రవేశించింది. అద్భుతమైన ప్రతిభ, సాంకేతిక విలువలతో కూడిన సినిమాలతో పరిశ్రమ స్థాయి నిరంతరం పెరుగుతోంది. అదే స్ఫూర్తితో 'మైసా' చిత్రాన్ని కూడా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, సరికొత్త యాక్షన్ విజువల్స్ తో పెద్ద తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నాం. మేము అనుకున్న ఈ విజన్‌ను ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నవంబర్ 27న జరగాల్సిన థియేట్రికల్ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం" అని చిత్ర బృందం తమ ప్రకటనలో వివరించింది. అయితే కొత్త విడుదల తేదీని ప్రస్తుతానికి వెల్లడించలేదని, అతి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం రాదని మేకర్స్ భరోసా ఇచ్చారు.

చిత్ర యూనిట్ విడుదల చేసిన అధికారిక ప్రకటనపై కథానాయిక రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ ప్రకటనను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ.. "సినిమా విడుదల వాయిదా పడుతోంది. ఎప్పటికి వస్తుందో నాకూ ఇంకా తెలియదు. కానీ విడుదల తేదీ ఎప్పుడనేది నాకు తెలిసిన వెంటనే కచ్చితంగా మీతో పంచుకుంటాను" అని రష్మిక పేర్కొన్నారు.

ఈ చిత్రానికి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు రాజ్ కుమార్ కందమూడి కథను సమకూర్చారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రష్మికతో పాటు ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేశ్, శివ కందుకూరి, కార్తీక్ రంజని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.