టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపై సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన తొలిసారిగా ఓ సెలబ్రిటీ టాక్ షో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ షోకు 'మెగావర్స్' (Megaverse) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులతో ముచ్చటించే ఈ టాక్ షో లాంచ్‌కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

సమయం తెలుగు కథనం ప్రకారం.. ఈ షో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 30, 2026న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరుకానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 'CHIRA_JEEVI' పేరుతో భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. ఈ షోకు సంబంధించిన తొలి ప్రోమో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ టాక్ షో చిత్రీకరణకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ షోలో పాల్గొనే అతిథుల విషయానికొస్తే సినీ దిగ్గజాలు కమల్ హాసన్, నాగార్జునలతో పాటు ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని, హాస్యనటులు బ్రహ్మానందం, సత్య తదితరులు కనిపించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, అతిథుల జాబితాకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

గతంలో పలు టెలివిజన్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మెప్పించిన చిరంజీవి, తొలిసారి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై టాక్ షో చేయనుండటం సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచుతోంది. ఒకే వేదికపై చిరంజీవితో పాటు స్టార్ హీరోలు పాల్గొనే ఎపిసోడ్లు అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.
20261122frd783bf3eb24a.jpg20261122frc46df6e62b9a.jpg