భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారాన్ని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చే ఆభరణాలు కూడా చాలా ఇళ్లలో ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చనే విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిగితే ఇంట్లో ఉన్న బంగారాన్ని అధికారులు జప్తు చేస్తారా అన్న భయం కొందరిలో ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పుతో ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చింది.

హైదరాబాద్ ఐటీఏటీ కీలక తీర్పు
ఇటీవల ఓ పన్ను చెల్లింపుదారుడి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో 807.5 గ్రాముల నికర బరువున్న బంగారు ఆభరణాలు లభించాయి. వాటి విలువ సుమారు రూ.16.01 లక్షలుగా నిర్ధారించారు. సరైన ఆధారాలు చూపలేదంటూ అధికారులు దానిని లెక్కల్లో చూపని పెట్టుబడిగా భావించారు. దీనిపై పన్ను చెల్లింపుదారుడు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ బంగారం భార్య, కుమార్తె, కుమారుడు, తనదని వివరించారు. కుటుంబ సభ్యుల పరిమితికి లోబడే ఆ బంగారం ఉందని ట్రిబ్యునల్ అంగీకరించింది. దీంతో రూ.16 లక్షల అదనపు పన్ను పెంపును పూర్తిగా కొట్టివేసింది.

సీబీడీటీ మార్గదర్శకాల పరిమితులు ఇవే
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిబంధనల ప్రకారం సోదాల సమయంలో నిర్దిష్ట పరిమితుల్లోపు ఉన్న బంగారాన్ని అధికారులు జప్తు చేయకూడదు: 

  • వివాహిత స్త్రీ: 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు. 
  • అవివాహిత స్త్రీ: 250 గ్రాముల వరకు ఆభరణాలు.
  • పురుషుడు: 100 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు.

ఈ పరిమితులకు లోబడి ఇంట్లో బంగారం ఉంటే అధికారులు దానిని స్వాధీనం చేసుకోరు. అంతేకాకుండా కుటుంబ సాంప్రదాయాలు, హోదాను బట్టి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పరిశీలించి మినహాయింపు ఇచ్చే అధికారం అధికారులకు ఉంటుంది.

ఇంట్లో బంగారం పరిమితిపై ఉన్న అపోహలు
సీబీడీటీ నిర్దేశించిన ఈ పరిమాణాలు బంగారం కలిగి ఉండటానికి గరిష్ఠ పరిమితులు కావు. ఆదాయ మార్గాలు స్పష్టంగా ఉంటే ఎంత బంగారమైనా ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. సరైన లెక్కలు, ఇన్వాయిస్‌లు ఉంటే పరిమితికి మించి బంగారం ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం సోదాలు జరిగినప్పుడు వెంటనే జప్తు చేయకుండా ఉండటానికి మాత్రమే బోర్డు ఈ పరిమితులను మార్గదర్శకంగా ఇచ్చింది. వారసత్వంగా వచ్చిన బంగారమైనా సరే మూలాలు నిరూపించగలిగితే ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదు.

నగదు నిల్వలపైనా ట్రిబ్యునల్ స్పష్టత
ఇదే కేసులో పన్ను చెల్లింపుదారుడి ఇంట్లో దొరికిన రూ.3.88 లక్షల నగదుపైనా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తమ వ్యాపార బ్యాలెన్స్ షీట్ లెక్కల్లో అంతకంటే ఎక్కువ నగదు చేతిలో ఉన్నట్లు చూపించారని ట్రిబ్యునల్ గుర్తించింది. పుస్తకాల్లో నమోదైన లెక్కల ప్రకారం నగదు నిల్వలు సరిపోవడంతో ఆ పన్ను భారాన్ని కూడా రద్దు చేసింది. సరైన రికార్డులు నిర్వహిస్తే ఎలాంటి తనిఖీల సమయంలోనైనా చట్టబద్ధమైన రక్షణ లభిస్తుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.