ఐఐటీ విద్యార్థులతో సమానంగా ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) విద్యార్థులకూ సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం దక్కాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకు లోకేశ్ స్పందిస్తూ, ఈ ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన ఫ్యాక్టరీ వర్క్‌ఫోర్స్‌కు ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత భారీగా పెరుగుతాయని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. "నేను యువకుడిగా ఉన్నప్పుడు జర్మనీలోని ఆటోమొబైల్ ఫ్యాక్టరీలలో ఇంటర్న్‌షిప్ చేశాను. అక్కడ నైపుణ్యం కలిగిన కార్మికులను ఎంతగా గౌరవిస్తారో నేను స్వయంగా చూశాను. ఆ నైపుణ్యాలకు ఇచ్చే గౌరవమే జర్మనీ ప్రపంచంలోనే అత్యుత్తమ తయారీ రంగ కేంద్రంగా ఎదగడానికి ప్రధాన కారణమైంది. మన దేశంలో కూడా ఐటీఐలపై ఉన్న చిన్నచూపును తొలగించి, నైపుణ్యంతో కూడిన పనులపై గౌరవమర్యాదలు తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని లోకేశ్ వివరించారు.

రాబోయే రోజుల్లో తయారీ, పారిశ్రామిక రంగాలలో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం గణనీయంగా పెరుగుతుందని ఆయన తెలిపారు. సాధారణ విద్యా కోర్సులతో సమానంగా వృత్తి విద్యా కోర్సులకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీఐ విద్యార్థుల పట్ల సమాజంలో సానుకూల దృక్పథం ఏర్పడినప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తమ వృత్తి పట్ల వారు మరింత గర్వపడే వాతావరణం ఏర్పడుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.