ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భారత్ ‘ఏ’ జట్టుకు నిరాశ ఎదురైంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం పాకిస్థాన్ షాహీన్స్ జట్టుతో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ తిలక్ వర్మ (149 బంతుల్లో 100) అద్భుతమైన సెంచరీతో చివరి వరకు పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ ‘ఏ’ జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (42 బంతుల్లో 70) ఆరంభంలో మెరుపులు మెరిపించాడు. అనంతరం తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్ (49 బంతుల్లో 56) కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టులో ఆశలు రేపారు. అయితే, స్కోరు వేగం పెంచాల్సిన సమయంలో పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశారు. 43.3 ఓవర్ల వద్ద 241 పరుగుల స్కోరు వద్ద షాబాజ్ అహ్మద్ ఏడో వికెట్‌గా వెనుదిరగడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

ఓటమి అనంతరం కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ఛేదనలో చివరి దశలో వేగంగా ఆడలేకపోయామని అంగీకరించాడు. అలాగే ఆఖ‌ర్లో ఒక్క‌రైనా మ‌ద్ద‌తు ఇచ్చి ఉంటే తానే మ్యాచ్‌ను ముగించగలిగేవాడిన‌ని తెలిపాడు  "ఆరంభంలో అభిషేక్, మధ్యలో షాబాజ్‌తో నేను నెలకొల్పిన భాగస్వామ్యం చాలా కీలకం. కానీ దురదృష్టవశాత్తు, మేము వేగం పెంచాలనుకున్న సమయంలోనే షాబాజ్ ఔటయ్యాడు. అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండుంటే, నేను మ్యాచ్‌ను ముగించగలిగేవాడిని" అని తిలక్ విచారం వ్యక్తం చేశాడు.

"నా వరకు జట్టును గెలిపించడమే ముఖ్యం. జట్టు గెలవనప్పుడు నా సెంచరీకి పెద్దగా విలువుండదు. ఆటను చివరి వరకు తీసుకెళ్లాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఈ రోజు కూడా అదే చేశాను. మరో బ్యాటర్ నుంచి మద్దతు లభించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అయితే, జట్టు కెప్టెన్‌గా ఆ భారాన్ని, బాధ్యతను నేను తీసుకోవాలి. ఆ బాధ్యతను నేను ఇష్టపడతాను" అంటూ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు.