ప్రేమకు దేశ సరిహద్దులతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఖమ్మం నగరానికి చెందిన యువకుడు, బ్రిటన్‌కు చెందిన యువతి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆదివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంగ్లాండ్‌లోని ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో వీరి మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారి, పరిణయానికి దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ముస్తాఫానగర్‌కు చెందిన సగ్గుర్తి లక్ష్మణ్, రోజా దంపతుల కుమారుడు భరత్, స్థానికంగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. 2021లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన, అక్కడే ప్రభుత్వ పెన్షన్ విభాగంలో ఉద్యోగంలో చేరారు. అదే విభాగంలో బ్రిటన్‌కు చెందిన ఎడ్మిన్ ఆర్మ్‌స్ట్రాంగ్, హాజెల్ గ్రేలీల కుమార్తె ఎలిజబెత్ కూడా పనిచేస్తున్నారు.

కార్యాలయంలో ఏర్పడిన పరిచయం కొద్దికాలానికే ప్రేమగా మారింది. దీంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట, తమ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. ఇరు కుటుంబాలు వీరి నిర్ణయానికి అంగీకారం తెలపడంతో, ఖమ్మంలోని బోనకల్లు రోడ్డులో ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.