ఏపీలో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ' (పీఆర్పీ)ని స్థాపించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, తన రాజకీయ కార్యాచరణలో దూకుడు పెంచారు. వినూత్న ప్రచార శైలితో ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా తన మనవరాలు, దివంగత నందమూరి తారకరత్న కుమార్తె అయిన నిష్కతో కలిసి ఆయన చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా తన వయసుపై వస్తున్న విమర్శలకు ఆయన వినూత్నంగా సమాధానమిచ్చారు.

'తాతా, ఈ వయసులో నీకు రాజకీయాలు అవసరమా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని కామెంట్స్‌లో అడుగుతున్నారు, వారికేం చెప్పమంటావ్?' అని నిష్క ప్రశ్నించగా, విజయసాయిరెడ్డి స్పందించారు. "ఇప్పుడే వారికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. వయసుకు గౌరవం దానంతట అదే రావొచ్చు, కానీ నమ్మకం రాదు కదా. నేను కెరీర్ నిర్మించుకోవాల్సిన అవసరం గానీ, పదవిని కాపాడుకోవాల్సిన అవసరం గానీ లేదు. ఏడాది పాటు వేచి చూడమని చెప్పు. నేను చేసే పని నచ్చితే నాకు లైక్ కొట్టమను, లేదంటే కామెంట్స్ పెట్టిన వారికే లైక్ కొట్టు. వయసు చూసి గౌరవించొచ్చు, పని చూసే నమ్మాలి" అని ఆయన బదులిచ్చారు.

ఈ సందర్భంగా తన రాజకీయ లక్ష్యాలను కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తన అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వ-బానిసత్వ రాజకీయాలను మార్చడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించారు. తన పార్టీలో నియంతృత్వ పోకడలకు చోటు లేదని, ఆత్మగౌరవం కోసం నిరంకుశ రాజకీయాలకు వ్యతిరేకంగా పీఆర్పీ ఆవిర్భవించిందని వివరించారు. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన క్షుద్ర రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించడానికి తాను సిద్ధమని, తనతో కలిసి రావాలని ప్రజలను కోరారు.

ప్రధాన రాజకీయ పార్టీలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. "అభివృద్ధిని గాలికొదిలేసి, సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం ఇస్తారనుకునే రోజులు పోయాయి. ప్రజారంజకంగా పరిపాలన చేస్తేనే అందలమెక్కిస్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాధించే గెలుపు తాత్కాలికమే" అంటూ ఆయన చురకలంటించారు. ఈ నెల 11న పార్టీని ఏర్పాటు చేసిన విజయసాయిరెడ్డి, ఇప్పటికే 5 లక్షలకు పైగా సభ్యత్వాలు పూర్తయినట్లు ప్రకటించి, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు.