ఐపీఎల్ 2027 సీజన్‌లో వరుసగా మూడోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించడంపై డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధీమాగా ఉంది. డిసెంబర్ 16న జరగనున్న మినీ వేలానికి ముందు జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లపై హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ కోర్ టీమ్‌తో హ్యాట్రిక్ టైటిల్ సాధిస్తామని విశ్వాసం వెలిబుచ్చాడు.

మినీ వేలానికి ముందు ఆర్సీబీ తమ టైటిల్ విన్నింగ్ జట్టులోని కీలక సభ్యులతో సహా మొత్తం 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రూ. 14.15 కోట్ల పర్స్‌తో వేలంలోకి అడుగుపెట్టనుంది. జట్టులో ఇంకా ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తక్కువ పర్స్‌తో వేలానికి వెళ్తున్నప్పటికీ, తమ వద్ద పటిష్ఠ‌మైన జట్టు ఉండటం సానుకూలాంశమని ఫ్లవర్ అన్నాడు.

'జియోస్టార్‌'తో మాట్లాడుతూ ఫ్లవర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "గత రెండు సీజన్లు మాకు అద్భుతంగా గడిచాయి. ఈ సైకిల్‌లో మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. మా ప్రస్తుత జట్టుతో ఎంతో నమ్మకంగా ఉన్నాము. వేలంలో జట్టును మరింత మెరుగుపరచడం మా బాధ్యత. అయితే, ఇతర జట్లతో పోలిస్తే మా వద్ద ఖర్చు చేసేందుకు తక్కువ డబ్బు ఉంది. అయినా మేం దాని గురించి ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే గత రెండేళ్లుగా అద్భుతంగా రాణించిన మా కోర్ టీమ్‌ను అట్టిపెట్టుకున్నాం. ఈ కలయిక 2027లో కూడా మాకు బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం. వరుసగా మూడు టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టించేందుకు ఇది మాకు చాలా ముఖ్యమైన సీజన్" అని ఫ్లవర్ వివరించాడు.

ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్య, ఫిల్‌ సాల్ట్, టిమ్ డేవిడ్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో జాకబ్ బెథెల్, రిచర్డ్ గ్లీసన్‌తో పాటు మరో నలుగురిని జట్టు నుంచి విడుదల చేసింది. గోవాలో జరిగే వేలంలో వ్యూహాత్మకంగా కొద్దిమంది ఆటగాళ్లను ఎంపిక చేసుకొని, జట్టును మరింత బలోపేతం చేయాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది.