సవాళ్లను ఎదుర్కోకుండా తాను జీవించలేనని, సంకుచిత భావజాలాన్ని వీడినప్పుడే వ్యక్తులతో పాటు దేశం పురోగమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటాన్ని నేర్చుకోకపోతే అనుకున్న ప్రగతిని ఎప్పటికీ సాధించలేమని యువతకు సూచించారు. దేశ ప్రగతిని అడ్డుకునే అతిపెద్ద అవరోధం మనసులోని పరిమితులేనని, గత కొన్నేళ్లుగా భారత్ ఆ అడ్డంకులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని స్పష్టం చేశారు.

ఒకప్పుడు దేశంలో పేదరికాన్ని మార్చలేని శాపంగా భావించే వారని, భారత్ దాని నుంచి ఎప్పటికీ బయటపడలేదన్న అభిప్రాయం ఉండేదని ప్రధాని గుర్తుచేశారు. గతంలో ఎవరూ ఆ సమస్యను పరిష్కరించే సాహసం చేయలేదన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చామని చెప్పారు.

ఫలితంగా దేశంలో దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్వయంగా ధ్రువీకరించిందని తెలిపారు. గత 75 ఏళ్ల కాలంలో భారత్ ఎడ్లబండ్ల స్థాయి నుంచి బుల్లెట్ రైళ్ల దిశగా వేగంగా ఎదిగిందని, ఈ చారిత్రక మార్పులకు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధన రంగంలోనూ సరికొత్త మార్పులు తెచ్చామని మోదీ వివరించారు. గతంలో ఇస్రోలోకి ప్రతిభావంతులైన యువత ప్రవేశంపై అనేక ఆంక్షలు ఉండేవని, వాటిని తొలగించి అర్హులైన యువ నిపుణులకు తలుపులు తెరిచామని వెల్లడించారు. అందుకే నేడు భారత అంతరిక్ష విజయాలను ప్రపంచం మొత్తం గుర్తిస్తోందన్నారు. 

సెమీకండక్టర్ల రంగంలో ఐదు దశాబ్దాల క్రితం అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, తాము పట్టుదలతో నాలుగేళ్లలోనే భారీ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర పోషించనుందని, విద్యార్థులు 'దేశమే ప్రథమం' అనే నినాదంతో సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు.