హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) వార్షిక సదస్సు, ప్రతినిధులకు అందిస్తున్న అరుదైన ఆతిథ్యంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. సదస్సుకు హాజరైన 5 వేల మందికి పైగా అతిథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు భోజనాలు రుచుల జాతరను తలపిస్తున్నాయి. మొత్తం 90కి పైగా వంటకాలతో రాయల్ నిజామియా శైలిలో ఘనమైన ఏర్పాట్లు చేశారు.

ఈ విందులో హైదరాబాదీ వంటకాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. మధ్యాహ్నం బిలాల్ చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ వడ్డించగా, రాత్రి భోజనంలో చికెన్ యఖ్నీ పులావ్, హైదరాబాద్ షాదీ వాలీ మటన్ బిర్యానీతో అతిథులను ఆకట్టుకున్నారు. కేవలం హైదరాబాదీ రుచులకే పరిమితం కాకుండా తెలంగాణ, రాయలసీమ సంప్రదాయ వంటకాలనూ మెనూలో చేర్చారు. రాయలసీమ స్పెషల్స్ అయిన ఉగ్గాని, మిర్చీ బజ్జీ, రాగిముద్ద, వంకాయ చట్నీ, నాటుకోడి పులుసు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మాంసాహార ప్రియుల కోసం గోంగూర మటన్, నెల్లూరు మామిడి చేపల పులుసు, గోంగూర రొయ్యలు, మటన్ రోగన్ జోష్ వంటి విస్తృతమైన మెనూను సిద్ధం చేశారు. అదే సమయంలో శాకాహార ప్రియుల కోసం కడాయి పనీర్, వంకాయ పకోడీ ఫ్రై, కీరా జీడిపప్పు కర్రీ, బేబీ కార్న్ కుర్మా వంటి అనేక రకాల వంటకాలను అందించారు.

దక్షిణ, ఉత్తర భారత వంటకాలతో పాటు విదేశీ రుచులను కూడా అతిథులకు పరిచయం చేశారు. మధ్యాహ్నం మంగోలియన్ కౌంటర్, రాత్రి మెక్సికన్ చిల్లీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటికి తోడు పైనాపిల్ జ్యూస్, ఆమ్ కా పన్నా, స్ట్రాబెర్రీ లెమనెడ్ వంటి విభిన్న రకాల పానీయాలతో స్వాగతం పలికారు. మొత్తంగా ఐఆర్‌సీ సదస్సులో ఏర్పాటు చేసిన ఈ భోజన ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.