గుజరాత్‌లో ఓ వ్యాపారిని రూ.40 లక్షల మేర మోసం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజమైన నోట్ల కట్టలని నమ్మించి, ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించిన నకిలీ నోట్లను అంటగట్టి ఈ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబం పక్కా ప్రణాళికతో పోలీసుల సహాయంతో నిందితులను పట్టుకుంది. ఈ వివరాలను పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

ఘట్లోడియా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన వ్యాపారి రికేన్ పటేల్ ఈ ఫిర్యాదు చేశారు. ఆయన మామ, ఉంఝాలో ట్రేడింగ్ సంస్థ నడుపుతున్న రోహిత్‌కుమార్ పటేల్‌కు నాగ్‌పూర్‌లోని ఓ వ్యాపార భాగస్వామి నుంచి రూ.40 లక్షలు రావాల్సి ఉంది. ఈ నగదును ఆన్‌లైన్ అంగడియా (సంప్రదాయ కొరియర్) సర్వీస్ ద్వారా పంపారు. అయితే, మంగళవారం అందిన 8 నోట్ల కట్టలను పరిశీలించగా, అవన్నీ నకిలీవని తేలింది. ఒక్కో కట్టలో రూ.5 లక్షలు ఉన్నాయని నమ్మించి మోసం చేశారు.

దీంతో మోసపోయిన వ్యాపారి కుటుంబం, నిందితులను పట్టుకోవడానికి పోలీసుల సహాయంతో పక్కా ప్రణాళిక రచించింది. అహ్మదాబాద్‌లో మరోసారి నగదు డెలివరీకి ఏర్పాట్లు చేసింది. గురువారం అహ్మదాబాద్‌లోని పారస్‌నగర్ పెట్రోల్ పంప్ వద్దకు వచ్చిన ఢిల్లీకి చెందిన రాహుల్ సింగ్ ఠాకూర్ (23), రాజస్థాన్‌కు చెందిన మల్‌చంద్ శర్మ (30) నోట్ల కట్టలను చూపిస్తుండగా పోలీసులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఠాకూర్ వద్ద ఉన్న బ్యాగ్‌లో 17 నకిలీ నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’, ‘భారతీయ మనోరంజన్ బ్యాంక్’ అని రాసి ఉన్న 1,666 నకిలీ రూ.500 నోట్లు ఉన్నాయి. నిజమైనవని నమ్మించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ లేబుళ్లను కూడా అతికించారు.

విచారణలో నోయిడాలో ఉంటున్న తన సోదరుడు గజానన్ శర్మ ద్వారా ధన్‌రాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని మల్‌చంద్ శర్మ పోలీసులకు తెలిపాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వరుణ్ అనే వ్యక్తి నుంచి ఈ నకిలీ నోట్ల కట్టలను తీసుకుని అహ్మదాబాద్‌లో డెలివరీ చేయాలని ధన్‌రాజ్ తమకు సూచించినట్లు చెప్పాడు. 

ఈ పనికి తమకు ఒక్కొక్కరికి రూ.5,000 ఇస్తామని హామీ ఇచ్చారని నిందితులు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై రాహుల్ సింగ్, మల్‌చంద్ శర్మ, గజానన్ శర్మ, ధన్‌రాజ్, వరుణ్‌లపై 'భారతీయ న్యాయ సంహిత' (బీఎన్ఎస్‌) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రాకెట్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.