దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వివాహాల వల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై పడే ప్రభావం దృష్ట్యా, కొత్త చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ప్రభుత్వాన్ని ఆదేశించడం తమ ఉద్దేశం కాదని, కేవలం ఈ అంశంపై సున్నితంగా స్పందించేలా చేస్తున్నామని స్పష్టం చేసింది.

బెంగళూరుకు చెందిన చార్వి ఎస్ అనే లా విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ స్వయంగా మేనరిక వివాహం ద్వారా జన్మించిన బిడ్డ కావడం, 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతుండటం గమనార్హం. దగ్గరి బంధుత్వంలో పెళ్లిళ్ల వల్ల పుట్టబోయే పిల్లలకు నివారించదగిన జన్యుపరమైన హాని జరుగుతోందని, ఆచారం పేరుతో దీనిని కొనసాగించకూడదని ఆమె తన పిటిషన్‌లో వాదించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. సామాజిక సంస్కరణలకు సంబంధించిన చట్టాలను రూపొందించడం పూర్తిగా శాసనసభ పరిధిలోకి వస్తుందని, న్యాయస్థానాలు వాటిని నియంత్రించలేవని ధర్మాసనం అభిప్రాయపడింది. వివాహం అనేది వ్యక్తిగత ఎంపిక అని, అయితే దాని పరిణామాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

దగ్గరి బంధువుల మధ్య వివాహాల వల్ల పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు, ఇంద్రియాల బలహీనత, శిశు మరణాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆధునిక వైద్య అధ్యయనాలు చెబుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హిందూ వివాహ చట్టంలోని నిబంధనలకు సవరణలు చేసి, ఇలాంటి వివాహాలకు ముందు తప్పనిసరిగా జన్యుపరమైన కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు, ప్రమాదాల గురించి వివరించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.

ఈ పిటిషన్ ఉద్దేశం ఇప్పటికే జరిగిన వివాహాలను నేరంగా పరిగణించడం కాదని, భవిష్యత్తు తరాలకు హాని జరగకుండా నివారించడమేనని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించిన తర్వాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.