అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఓటమి పాలైన నేపథ్యంలో ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా పాక్ క్రికెట్ బోర్డు, జట్టు యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ జట్టు వ్యూహాలు అత్యంత దిగజారిపోయాయని, బౌలింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పాకిస్థాన్ అండర్-19 ఆటగాళ్ల వయసుపై కూడా ఆయన బహిరంగంగానే సందేహాలు వ్యక్తం చేశారు.

అల్ అమెరత్‌లో జరిగిన ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 337 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, చివర్లో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చివరి ఓవర్‌లో భారత టెయిలెండర్లు క్రీజులో ఉండగా, పేసర్లు అందుబాటులో ఉన్నప్పటికీ బంతి తిప్పడం రాని స్పిన్నర్‌కు బౌలింగ్ ఇవ్వడం కెప్టెన్, కోచింగ్ స్టాఫ్ ఘోర తప్పిదమని కనేరియా తప్పుబట్టారు. 8 వికెట్లు పడ్డాక కూడా 50 పరుగులకు పైగా సమర్పించుకోవడం పాకిస్థాన్ బౌలింగ్ చరిత్రకే మాయని మచ్చని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్ల వయసును ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో తన తల్లి సైతం భారత జట్టులో చిన్న పిల్లలు ఆడుతుంటే, పాకిస్థాన్ తరఫున ఆడుతున్నది నేషనల్ టీమా అని అడిగిందని, వాళ్లు చాలా పెద్దవారిగా కనిపించారని పేర్కొన్నారు. మ్యాచ్ మధ్యలో పాక్ ఆటగాళ్లు అనవసరంగా దూకుడు ప్రదర్శించి కవ్వింపులకు దిగారని, గెలిచిన తర్వాత టీమిండియా కుర్రాళ్లు సరైన సమయంలో సంబరాలు చేసుకుంటే తప్పుపట్టడం సరికాదని సమర్థించారు. దేశవాళీ క్రికెట్‌ను గాలికొదిలేయడం వల్లే పాక్ క్రికెట్ ప్రమాణాలు ఇంతగా పతనమయ్యాయని, బీసీసీఐలా పీసీబీ ఆటగాళ్లను కాపాడుకోలేకపోతోందని కనేరియా స్పష్టం చేశారు.