మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తులాభారం’. ఈ క్రైమ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికగా నటిస్తున్న ప్రియాంకా అరుల్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ ‘కృష్ణవేణి’ అనే ఆసక్తికర పాత్రలో కనిపించనుంది. "ప్రతి తులాభారానికి సరైన బ్యాలెన్స్ కావాలి.. మా చిత్రంలో మరింత మెరుపును నింపిన ప్రియాంక మోహన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ నిర్మాణ సంస్థ బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకుంది. రవితేజ మార్క్ హై-ఓల్టేజ్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ వినూత్న స్క్రీన్‌ప్లే కలయికతో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల ‘ఇరుముడి’ ఘనవిజయంతో జోరుమీదున్న రవితేజ, ఈ సినిమాలో సరికొత్త కోణంలో ప్రేక్షకులను అలరించనున్నాడు. లక్ష్మణ్, శ్రీని రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్రైమ్, డ్రామా, పూర్తి స్థాయి వినోదం మిళితమై ఉంటాయని సమాచారం. గతంలో ‘RT78’గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పేరును ప్రత్యేక ‘టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియో ద్వారా వెల్లడించి మేకర్స్ వినూత్నంగా ప్రచారం ప్రారంభించారు.

ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో తరుణ్ భాస్కర్ (దేవరాజ్), జేడీ చక్రవర్తి (శివాజీ రావు), అనస్వర రాజన్ (సౌండ్), అనిల్ కరెళ్ల (జడేజా), రవి ఆంథోనీ (రాబిన్) నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్‌ను, జీఎం శేఖర్ ఆర్ట్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.