ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో గేమ్ 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6' (జీటీఏ 6) మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. విడుదలైన తొలి వారంలోనే ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.25 బిలియన్ డాలర్ల నుంచి 5.2 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.30,574 కోట్ల నుంచి రూ.48,918 కోట్లు) మేర అమ్మకాలు నమోదు చేస్తుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ న్యూజూ అంచనా వేసింది. ప్రముఖ మీడియా సంస్థ 'వెరైటీ' ఈ వివరాలను వెల్లడించింది.

ఈ అంచనాలు నిజమైతే ఒక వినోద సాధనం సాధించే అతిపెద్ద ఆర్థిక రికార్డుగా ఇది నిలవనుంది. భారత్ తన అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్ దాదాపు రూ.13,705 కోట్లు కాగా, జీటీఏ 6 తొలి వారంలో సాధించబోయే గరిష్ఠ ఆదాయం అంతరిక్ష బడ్జెట్ కంటే దాదాపు 3.6 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ గేమ్ నవంబర్ 19, 2026న ప్లేస్టేషన్ 5 (PS5), ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్|ఎస్ (Xbox Series X|S) కన్సోళ్లలో అధికారికంగా విడుదల కానుంది. 'జీటీఏ 5' వచ్చి దాదాపు 13 ఏళ్లు పూర్తయిన తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని పోలి ఉండే కల్పిత 'లియోనిడా' ప్రాంతం నేపథ్యంలో ఈ గేమ్ సాగుతుంది. ప్రసిద్ధ నేరగాళ్ల జంట బోనీ అండ్ క్లైడ్ తరహాలో లూసియా కామినోస్, జాసన్ డువాల్ అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది. రాక్‌స్టార్ సంస్థ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం దాదాపు 1 బిలియన్ నుంచి 1.5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ప్రీ-ఆర్డర్లలోనూ జీటీఏ 6 గత రికార్డులను తిరగరాస్తోంది. న్యూజూ నివేదిక ప్రకారం.. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారిలో దాదాపు 89 శాతం మంది 100 డాలర్ల విలువైన 'అల్టిమేట్ ఎడిషన్'ను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపగా, కేవలం 11 శాతం మంది మాత్రమే 80 డాలర్ల 'స్టాండర్డ్ ఎడిషన్'ను ఎంచుకున్నారు. మొత్తం డిజిటల్ ప్రీ-ఆర్డర్లలో ప్లేస్టేషన్ 5 యూజర్ల వాటా దాదాపు 75 శాతం (సుమారు 751 మిలియన్ డాలర్లు) ఉండగా, ఎక్స్‌బాక్స్ వాటా 25 శాతం (దాదాపు 250 మిలియన్ డాలర్లు)గా ఉంది. నవంబర్ 10 నుంచే ఈ గేమ్‌కు సంబంధించిన ప్రీ-డౌన్‌లోడ్స్ ప్రారంభమయ్యాయి.

సాంకేతిక పనితీరు విషయానికి వస్తే.. ప్రస్తుత తరం కన్సోళ్లలో ఈ గేమ్ 30 ఎఫ్‌పీఎస్ (ఫ్రేమ్స్ పర్ సెకండ్) సామర్థ్యంతో నడుస్తుంది. ప్లేస్టేషన్ 5 ప్రోలో రే-ట్రేసింగ్ షాడోలు, మరింత మెరుగైన గ్రాఫిక్స్‌తో గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. విడుదల ముంగిట నెలకొన్న ఈ భారీ హైప్, వినోద రంగాన్ని సరికొత్త మలుపు తిప్పుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.