సాధారణంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ అంటే ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఉపాధి పోతుందన్న భయంతో కుంగిపోతారు. కానీ ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ కి మాత్రం కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్ నిజమైన ఉపశమనాన్ని ఇచ్చాయి. ప్రముఖ సెమీకండక్టర్ దిగ్గజం క్వాల్‌కామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, తనను లేఆఫ్స్‌లో భాగంగా తొలగించాలని స్వయంగా మేనేజర్‌ను అభ్యర్థించి మరీ దాదాపు 15 నెలల జీతానికి సమానమైన భారీ ప్యాకేజీని చేజిక్కించుకున్నాడు.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఈ ఉద్యోగి దాదాపు ఆరు నెలల క్రితం మెరుగైన అనుభవం వస్తుందనే ఆశతో కంపెనీలోని మరో విభాగానికి బదిలీ అయ్యి, వేరే నగరానికి మారాక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అక్కడ సరైన వర్క్ కల్చర్ లేకపోవడం, సహోద్యోగుల నుంచి సరైన సహకారం అందకపోవడం, వ్యక్తిగత విమర్శలు ఎదురుకావడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఇష్టం లేని ఆ పని వాతావరణంలో కొనసాగలేక దాదాపు ప్రతిరోజూ రాజీనామా చేయాలని భావించేవాడు.

సరిగ్గా అదే సమయంలో క్వాల్‌కామ్ సంస్థ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దీంతో సదరు ఇంజనీర్ దీనిని తనకు అనుకూలమైన అవకాశంగా మలచుకున్నాడు. స్వయంగా రాజీనామా చేస్తే సెవెరెన్స్ ప్యాకేజీ వంటి ఆర్థిక ప్రయోజనాలు దక్కవు, పైగా రీలోకేషన్ అలవెన్స్‌ను వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే అతను ఏకంగా తన మేనేజర్, డైరెక్టర్‌ను సంప్రదించి, తొలగించే ఉద్యోగుల జాబితాలో తన పేరును చేర్చాలని కోరాడు. కంపెనీ యాజమాన్యం కూడా అతని అభ్యర్థనకు అంగీకరించింది.

ఈ తొలగింపు ద్వారా అతనికి భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు లభించాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఆ ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం.. 3 నెలల ప్రామాణిక సెవెరెన్స్ పే, పేపర్‌వర్క్ వేగంగా పూర్తి చేసినందుకు మరో నెల వేతనం, సర్వీస్ కాలానికి సంబంధించి 5 నెలల పరిహారం, వెనక్కి ఇవ్వనవసరం లేని 2 నెలల రీలోకేషన్ బోనస్, జనవరి నెలాఖరు వరకు సాధారణ జీతం, ఉపయోగించని సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్‌లతో కలిపి మొత్తం సుమారు 15 నెలల వేతనానికి సమానమైన మొత్తం అతని చేతికి వచ్చింది.

ప్రస్తుతానికి వెంటనే మరో ఉద్యోగం వెతుక్కునే ఆలోచన లేదని, కుటుంబ సభ్యులతో గడపడానికి, కార్పొరేట్ ఒత్తిళ్ల నుంచి విరామం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అతను తెలిపాడు. ఈ విరామంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఇంటర్వ్యూలకు సిద్ధమవుతానని పేర్కొన్నాడు.

మరోవైపు క్వాల్‌కామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మందిని, అంటే సుమారు 3,600 మందిని తొలగించే యోచనలో ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారతదేశంలో కూడా దాదాపు 1,000 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఐఐటీ ఇంజనీర్‌కు లభించిన ప్యాకేజీ అతని వ్యక్తిగత అనుభవం మాత్రమేనని, తొలగింపునకు గురయ్యే ప్రతి ఉద్యోగికీ ఇవే రకమైన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని చెప్పలేమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.