భారత్‌-అమెరికా మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంతో సానుకూలంగా ఉన్నారని ఐబీఎం ఛైర్మన్‌, సీఈఓ అరవింద్‌ కృష్ణ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో భారతీయులు సాధిస్తున్న విజయాల పట్ల కూడా ట్రంప్‌ ప్రశంసాభావంతో ఉన్నారని వెల్లడించారు.

ఢిల్లీలో ఐఏఎన్ఎస్‌ సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. భారత్‌తో సంబంధాల విషయంలో ట్రంప్‌ ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటారని చెప్పారు.

ఇటీవల వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్‌తో కలిసి అరవింద్‌ కృష్ణ పాల్గొన్నారు. అమెరికాలో భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా, ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా, వ్యాపారవేత్త విశాల్‌ గొండాల్‌, అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ జయ్‌ భట్టాచార్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెమీకండక్టర్‌ తయారీలో ఐబీఎం సాధిస్తున్న పురోగతిని ట్రంప్‌ ఇటీవల ప్రశంసించారు.

భారతీయ నైపుణ్యానికి అమెరికాలో అవకాశాలు ఉంటాయని ట్రంప్‌ గతంలోనూ పేర్కొన్నారు. జూన్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రతిభావంతులైన భారతీయులకు అమెరికాలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు.