మధురైలో సంచలనం సృష్టించిన తనిష్క్ షోరూమ్ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిని ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్ చాకచక్యంగా పట్టించారు. టీవీ వార్తల్లో చూసిన దొంగను తన బస్సులో ప్రయాణికుడిగా గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ భారీ దోపిడీ కేసులో కీలక పురోగతి లభించింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి సేలం వెళుతున్న బస్సులో 25 ఏళ్ల యూట్యూబర్, బైక్-ట్యాక్సీ డ్రైవర్ అయిన నిశాంత్ ప్రయాణిస్తున్నాడు. అతడిని గుర్తించిన బస్ డ్రైవర్, తనకు పరిచయమున్న ధర్మపురి కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు, ధర్మపురి జిల్లాలోని శేషంపేట వద్ద బస్సును ఆపాలని ఆదేశించారు. నిన్న‌ రాత్రి పోలీసులు బస్సును చుట్టుముట్టడంతో నిశాంత్ వెనుక కిటికీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, పోలీసులు అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఇవాళ‌ అతడిని మధురైకి తరలించారు. అరెస్ట్ సమయంలో నిశాంత్ వద్ద దోచుకున్న నగల‌లో కొంత భాగం లభించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బంగారం ఎక్కడ దాచిపెట్టాడనే దానిపై అతడిని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నిశాంత్ తండ్రి, ఆటోరిక్షా డ్రైవర్ అయిన సురేశ్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అతడి స్నేహితురాలు మీనాక్షి నాచియార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మీనాక్షి ఇచ్చిన సమాచారంతోనే దాదాపు 5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దోపిడీ తర్వాత నగలను తరలించడంలో సురేశ్‌ సహాయం చేయగా, మీనాక్షికి చెందిన ద్విచక్ర వాహనాన్ని నేరానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మధురై బైపాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన తనిష్క్ షోరూమ్‌లో నవంబర్ 12న ఉదయం ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఇంకా నిర్మాణం పూర్తికాని భవనం వెనుక వైపు ఉన్న స్కాఫోల్డింగ్ ఎక్కి, టెర్రస్ పైకి చేరుకున్న దొంగ, లిఫ్ట్ షాఫ్ట్‌కు ఉన్న ఖాళీ ద్వారా లోపలికి ప్రవేశించాడు. 

షోరూమ్‌లో లాకర్ సదుపాయం ఇంకా నిర్మాణంలో ఉండటం, యాంటీ-బర్గ్‌లరీ అలారం పనిచేయకపోవడంతో నగలను రాత్రిపూట డిస్‌ప్లే కేస్‌లలోనే ఉంచారు. ఇదే అదనుగా దొంగ తన పని పూర్తిచేశాడు. అంతకుముందు నవంబర్ 5న కూడా ఒకసారి దొంగ లోపలికి ప్రవేశించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం నిశాంత్‌ను మధురై పోలీసులు విచారిస్తున్నారు.